'సెలబ్రిటీల డాన్సులు.. చేనేత ర్యాంప్ వాక్'.. కేటీఆర్‌కు ఎంపీ ఘాటు కౌంటర్!

ఈ విమర్శల వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. ఎవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పడమే.;

Update: 2026-04-29 06:08 GMT

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం.. కానీ అవి వ్యక్తిగత స్థాయికి వెళ్తే ఇరు వైపులా ప్రమాదమే.. రెండు పార్టీల ప్రజల మన్ననల పొందలేవు. అలాంటి ఘటనలు సమకాలీన రాజకీయాల్లో చాలానే ఉన్నాయి. మోడీని వ్యక్తిగతంగా విమర్శించిన చాలా మంది సీనియర్ నాయకులు అతీ గతీ లేకుండా పోయారు. అంత పెద్ద స్థాయి కాకున్నా రాష్ట్రంలోని సీనియర్ నాయకులపై బురద చల్లేప్పుడు కొంత ఆలోచించాలి.

ఇటీవల కేటీఆర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ మధ్య సాగిన మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. వారి ధూషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి. సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే భావనతో ఎంపీ చామల ఇచ్చిన కౌంటర్ ఘాటుగా ఉంది.

తెలంగాణలో అధికారం మారిన జరిగిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య 'గుర్తుంచుకోవడం' అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపాయి. దీనిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పందిస్తూ, గత ప్రభుత్వంలో సినిమా తారలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఎండగట్టారు. రాజకీయం అంటే గ్లామర్ షో కాదని, అది ప్రజల కోసం చేసే పోరాటం అని గుర్తుచేశారు.

గ్లామర్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ

ఎంపీ చామల కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల్లో అషు రెడ్డి వంటి వారితో డాన్సులు చేయించారని, దానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. అందుకే వారు మిమ్మల్ని (కేటీఆర్‌ను) గుర్తుపెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి ర్యాంప్ వాక్ చేయించడాన్ని చామల తప్పుబట్టారు. క్షేత్ర స్థాయిలో చేనేత కార్మికుల కష్టాల కంటే గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని విమర్శించారు.

‘గుర్తుంచుకోవడం’పై కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా ఎంపీ చామల ఒక బలమైన వాదనను వినిపించారు. రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తుపెట్టుకోరన్నది వాస్తవం కాదని, ప్రజలు ఆయన పోరాటాన్ని గుర్తించే కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కేవలం ఫొటో షూట్లు, ర్యాంప్ వాక్‌లతో గుర్తింపు రాదని, ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడిని వారు గుండెల్లో పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

పక్కదారి పడుతున్న విమర్శలు..

ఈ విమర్శల వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. ఎవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పడమే. తాము హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టామని, గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి గుర్తింపు తెచ్చామని కేటీఆర్ వర్గం భావిస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబం కేవలం ధనవంతులకు, సెలబ్రిటీలకే అందుబాటులో ఉందని, తాము సామాన్యులకు అందుబాటులో ఉన్నామని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.

రాజకీయాల్లో నాయకులను ఎవరు గుర్తుపెట్టుకుంటారు అనేది కేవలం మాటల ద్వారా తేలేది అంశం కాదు. అది వారు చేసిన పనులు, అమలు చేసిన పథకాలపై ఆధారపడుతుంది. సినిమా తారలతో చేసే ప్రచారాలు తాత్కాలికంగా ఆకర్షించవచ్చు కానీ, సామాన్యుడి కడుపు నింపే పథకాలే నాయకుడిని చిరస్థాయిగా నిలబెడతాయి. చామల కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేలా ఉన్నాయి.

Tags:    

Similar News