యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై పీవీ వర్ణనలు !

Update: 2021-07-26 10:47 GMT
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని (రామప్ప ఆలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ మేరకు యునెస్కో ట్వీట్ చేసింది. వారసత్వ కట్టడాల విశిష్టతలను గుర్తించేందుకు వర్చువల్‌ గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనితో అద్భుత శిల్పకళా సంపదకు కొలువైన ఈ కాకతీయుల నాటి ఆలయానికి వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దొరికింది.

కాకతీయుల వంశంలో గణపతి దేవుడు రాజ్యాన్నేలుతున్న కాలం. ఆయన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు, ఓ భవ్యమైన శివాలయాన్ని కట్టించేందుకు సంకల్పించాడు. ఏకబిగిన నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణ పనులు సాగాక క్రీ.శ 1213లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయ ప్రధాన శిల్పి పేరు రామప్ప. తదనంతర కాలంలో ఆ శిల్పాచార్యుడి పేరుతోనే ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా పూజలం దుకుంటున్నాడు. 1310లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్‌ కాఫర్‌ దండయాత్రతో ఈ ఆలయం బాగా దెబ్బతిన్నది. గుప్త నిధుల కోసం కొందరు తవ్వడంతోనూ కొంత నష్టం జరిగింది.

1819 జూన్‌ 16న 7.7-8.2 తీవ్రతతో భూకంపం సంభవించినా ఆలయం చెక్కుచెదరలేదు. దానికి కారణం.. అంతుబట్టని రీతిలో సాగిన నిర్మాణశైలే, భూకంపాలను సైతం తట్టుకొని నిలబడేందుకు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ (ఇసుక పునాది) ని ఉపయోగించారు. ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కుచెదరకుండా ఉండటం పరమాద్భుతం.  రాళ్లకు తాకితే వీణతంతులను మీటినట్లుగా స్వరాలు వినిపించడం.. నీళ్లలో వేస్తే ఇటుకలు మునిగిపోకుండా తేలియాడటం వంటి విశిష్టతలు రామప్ప ఆలయం సొంతం.

ఆలయంలో ఫ్లోరింగ్‌ అంతా గ్రానైట్‌ వాడారు. ఆలయం లోపలి భాగాల్లో ఎర్ర ఇసుక రాతి (రెడ్‌ శాండ్‌ స్టోన్‌) ని ఉపయోగించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే  కట్టడంపైన బరువును తగ్గించేందుకు ఆలయ గోపుర నిర్మాణంలో నీటి మీద వేస్తే తేలియాడే ఇటుకలను వినియోగించారు. వీటిని ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, చెట్ల జిగురుతో తయారు చేసినట్లుగా చెబుతారు. రామప్ప గర్భాలయంలో ఎత్తయిన పీఠంపై పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలోని శివుడి ఎదురుగా ఉన్న నంది మరో ఆకర్షణ. సూది పట్టేంత శిల్పాలు ఇక్కడ కొలువుదీరాయి. అంతేకాదు.. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు.
4

కానీ, ఎంత తెలిసినా కావలసిన గుర్తింపు మాత్రం చాలా ఆలస్యం అయిందనేది వాస్తవం. ఈ ఆలయ విశిష్టతను ఎందరో ప్రముఖులు చాలా కాలం క్రితమే ప్రపంచానికి తమ రచనల్లో తెలిపారు. మాజీప్రధాని.. పీవీ నర్సింహారావు ఈ ఆలయ విశిష్టతను చెబుతూ ఒక పుస్తకంలో అద్భుతమైన వ్యాసాన్ని రాశారు.  పి.వి.నరసింహారావు 1957 లో “ఇలస్ట్రేషన్ ఆఫ్ ఇండియా” లో తన వ్యాసాలలో “సింఫనీ ఇన్ స్టోన్” రాశారు. ఆలయ స్థలం  ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి దీనిని ప్రచురించారు. రామప్ప ఆలయాన్ని వివరించడం అంటే వ్రాతపూర్వక పదం అసమర్థతను ప్రదర్శించడం. చరిత్రకారులు, వాస్తుశిల్ప పండితులు ఈ గొప్ప నిర్మాణం  సాంకేతిక వివరణ అని పిలిచే ప్రయత్నం చేశారు. కానీ, వారు ఆలయంలోని అద్భుతమైన చిత్రాల్ని ఆలయ కళాత్మకతను అదేవిధంగా ఆలయంలో ఉట్టిపడే ఉత్కంఠంగా అందాన్ని దాని సంపదను ప్రపంచానికి చూపించడంలో విఫలం అయ్యారు. మన కళ్ళు చూసిన అద్భుతాన్ని మరే ప్రక్రియ కూడా సక్రమంగా చూపించలేదు అని ఆ వ్యాసంలో ఆయన పొందుపరిచారు.

లయ శిల్పకళను వర్ణిస్తూ  ఆలయ శిల్పం, ముఖ్యంగా మానవ కార్యకలాపాల వర్ణన ఎక్కడా కనిపించవు. ఎప్పుడూ తాజాగా కనిపించే ఆకర్షణ, చక్కదనం  ఈ శిల్ప కళలో కనిపిస్తాయి. డోర్ జాంబ్స్ స్తంభాల్లో చిల్లులతో కూడిన సరళి, వివిధ నృత్య భంగిమల్లో స్త్రీ బొమ్మలు, చౌరీ బేరర్స్, ద్వారపాలకులు ఇవన్నీ రకరకాలుగా ఉంది.. అప్పటి జీవితాలతో మమేకమై కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈ యుగపు శిల్పులు సాధించిన అత్యున్నత పనితనానికి మచ్చుతునకలు అని రాశారు.  పీవీతో పాటూ ఇంకా పలువురు తమ రచనల్లో రామప్ప గొప్పతనాన్ని ఎంతో ఉన్నతంగా తమ కలం పదునుతో చూపించారు

సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు.వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం.

2018 యునెస్కో నిపుణుల బృందం ఆలయాన్ని సందర్శించింది. 2019 నామినేషన్ పత్రం పంపబడింది, ఆ తరువాత ICOMOS నుండి నిపుణులు ఈ స్థలాన్ని సందర్శించారు. నవంబర్ 2019 లో, పాపా రావు, అతని ప్రతినిధి బృందం పారిస్ వెళ్ళారు. అక్కడ వారు ఆలయ స్థలం  విశిష్టమైన విశ్వ విలువ గురించి వివరించారు. 2020 నామినేషన్ ను పరిగణించారు.  ఫుజౌలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ కమిటీ 44 వ సెషన్లో తీసుకోబడింది. చివరకు వారు ఆలయాన్ని జాబితాలో చేర్చారు.

వారసత్వ సంపదగా దొరికిన గుర్తింపుతో ప్రయోజనం ఏముంటుంది అంటే.. రామప్ప ఆలయం దాని సాంస్కృతిక, సహజ వారసత్వ సంరక్షణకు ఆర్థిక సహాయం పొందుతుంది. ఇది అత్యవసర, పరిరక్షణ, నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులకు, జాతీయ తాత్కాలిక జాబితా క్రింద సన్నాహక సహాయం కోసం అంతర్జాతీయ సహాయం పొందుతుంది. మరమ్మత్తు అవసరమైతే సైట్‌‌ కు  ప్రపంచ ప్రాజెక్ట్ నిర్వహణ వనరులకు ప్రాప్యత ఉంటుంది. సైట్, అప్రమేయంగా, జెనీవా కన్వెన్షన్ క్రింద, యుద్ధ సంఘటనలలో కూడా రక్షణ పొందుతుంది

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి దూరం 209 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. రైల్లో వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి కాజీపేటలో లేదంటే వరంగల్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. 
Tags:    

Similar News