రజినీ - కమల్‌ బాటలో స్టాలిన్ కొడుకు

Update: 2018-01-22 16:24 GMT
దక్షిణాది నటులకు రాజకీయాలపై ఆసక్తి పెరిగిపోతోంది. సీనియర్ నటుల నుంచి కుర్ర నటుల వరకు అందరి కళ్లూ పాలిటిక్సుపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో నటుల రాజకీయ అడుగులు వడివడిగా పడుతున్నాయి. దిగ్గజ నటులు రజినీ కాంత్ - కమల్ హాసన్‌ లు ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వారే కాకుండా విశాల్ - శరత్ కుమార్ - విజయ్ వంటివారు నిత్యం రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
    
తమిళనాడు మాజీ సీఎం - డీఎంకే అధినేత కరుణానిధి మనవడే ఈ ఉదయనిధి. కరుణానిధి చిన్నకుమారుడు - డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుమారుడీయన. కాగా ఉదయనిధి ఇప్పటికే డీఎంకేలో సభ్యుడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రజనీకాంత్ - కమల్‌ ల తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. ఉదయనిధి ప్రస్తుతం నిమిర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రయలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా పలువురు విలేకర్లు ఆయనను రాజకీయాలపై ప్రశ్నించినప్పుడు ఈ సంగతి చెప్పారు.
    
తనకు రాజకీయాలు కొత్త కాదని.. సినిమాల్లోకి వచ్చిన తరువాత రాజకీయాలు వదిలేశానే కానీ, తాను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని అన్నారు. తన రక్తంలో డీఎంకే ఉందంటూ సినిమా స్టైల్లో చెప్పారు. తన తండ్రి స్టాలిన్ కోసం చెన్నైలోని 1000 లైట్స్ ప్రాంతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు కొందరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని, తాను కూడా పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తానని చెప్పారు.

Tags:    

Similar News