ఆ ఇద్దరు మహిళలు అయ్యప్ప కొండ దిగిపోయారు

Update: 2018-10-19 08:07 GMT
శబరిమల మూడో రోజు కూడా భగ్గుమంటోంది. మొండి పట్టుదలతో ముందుకెళ్తున్న ఇద్దరు మహిళలకు పోలీసులు భద్రత కల్పిస్తూ అయ్యప్ప కొండవైపు తీసుకెళ్లినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకుని వారు వెనుదిరిగారు.
   
కవితా జక్కల్ అనే జర్నలిస్ట్ - రెహానా ఫాతిమా అనే సామాజిక కార్యకర్త ఈ ఉదయం శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అందుకు గాను వారు పోలీసు భద్రత మధ్య కొండ ఎక్కినప్పటికీ నిరసనకారులు హెచ్చరికలు చేయడంతో ఆలయంలోకి వెళ్లకుండానే తిరిగి కొండ దిగిపోయారు. వారు మారకూటమ్ దాటి ముందుకెళ్లినప్పటికీ అక్కడి నుంచి ముందుకు సాగలేకపోయారు. గురువారం న్యూయార్క్ టైమ్స్ విలేకరి కూడా అక్కడి నుంచే వెనుకదిరగాల్సి వచ్చింది. ఆమెపై నిరసనకారులు రాళ్లు విసరడంతో వెనుదిరిగారు.
   
ఇద్దరు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వాలని పోలీసులు కోరగా.. నిరసనకారులు అందుకు నిరాకరించారు. ఆ ఇద్దరు మహిళలను ఆలయంలోకి వెళ్లనిచ్చేది లేదని.. అవసరమైతే అయ్యప్ప కోసం తాము చావడానికైనా సిద్ధమేనని నిరసనకారులు పోలీసులతో చెప్పారు.
   
శబరిమల ఆలయ తలుపులు బుధవారం తెరవగా రెండో రోజైన గురువారం కూడా నిరసనలు హోరెత్తడం.. హింస తీవ్రమవడంతో శబరిమలలో శాంతి నెలకొల్పడం కోసం తాము ఎలాంటి రాజీమార్గానికైనా సిద్ధమని ట్రావెన్‌ కోర్ దేవాస్వం బోర్డు ప్రకటించింది. ఇందుకోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికీ సిద్ధమేనని ప్రకటించింది. కాగా.. శబరిమల ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్‌ కోర్ దేవాస్వం బోర్డుకు అక్కడి అధికార పార్టీ సీపీఎం నేత ఎ.పద్మకుమారే అధ్యక్షుడిగా ఉండడంతో ప్రభుత్వం నుంచి ఈ మేరకు రివ్యూ పిటిషన్ వేసే దిశగా సూచనలొచ్చినట్లు చెబుతున్నారు.
   
కాగా హిందూ అతివాద సంస్థలు బంద్‌ కు పిలుపునివ్వడంతో నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. పోలీసులు గురువారం ఆరుగురికిపైగా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
   

Tags:    

Similar News