ఇద్ద‌రు సీఎం ల‌క్ష్యం రూ.ల‌క్ష కోట్ల ప్రాజెక్ట్‌!

Update: 2019-07-05 06:10 GMT
అనుకున్న‌ట్లే అయ్యింది. ప‌లువురు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే అత్యంత ఖ‌రీదైన ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తెర లేవ‌నుందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. గోదావ‌రి నీళ్ల‌ను నేరుగా శ్రీ‌శైలానికి మ‌ళ్లించేందుకు  ఉన్న మార్గాల‌పై రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేష‌న్ అధికారులు ద‌శ‌ల వారీగా చ‌ర్చలు జ‌రుపుతున్న వేళ‌.. దీనికి సంబంధించి ప్రాథ‌మిక ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తెచ్చారు.

దీని లెక్క చూస్తే నోరు వెళ్ల‌బెట్టాల్సిందే. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టును కార్య‌రూపంలోకి తీసుకురావాలంటే రూ.ల‌క్ష కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని లెక్క వేశారు. రెండు లేదంటే మూడు ద‌శ‌ల్లో లిఫ్టుల ద్వారా 380 కిలోమీట‌ర్ల దూరం నీటిని మ‌ళ్లించాల్సి ఉంటుంది. ఈ అంచ‌నా కార్య‌రూపం దాలిస్తే మ‌రింత పెర‌గ‌టం ఖాయం.

కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల‌తో పోలిస్తే.. ఈ ప్రాజెక్టు మ‌రింత ఖ‌రీదైన‌దిగా చెప్పాలి. గోదారి నుంచి శ్రీ‌శైలానికి నీరు మ‌ళ్లించే ప్ర‌తిపాద‌న‌కు సంబంధించి రెండో మార్గాల్లో కొత్త ప్ర‌తిపాద‌న‌కు క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. లిఫ్ట్ ప‌ద్ద‌తిలో నీరును చేర‌వేయ‌టం ఒక ప‌ద్ద‌తి అయితే.. సొరంగ మార్గం గుండా నీటిని పంప‌టం మ‌రో ప‌ద్ద‌తి.

ఈ విధానంలో మొద‌టిదైన లిఫ్ట్ ప‌ద్ద‌తిలో అయితే గోదావ‌రిపై కంత‌న‌ప‌ల్లి దిగువ‌న ఉన్న రాంపూర్ నుంచి న‌ల్గొండ జిల్లాలో నిర్మించిన ఉద‌య‌స‌ముద్రం వ‌ర‌కు నీటిని మ‌ళ్లిస్తారు. ఉద‌య స‌ముద్రం నుంచి వంద కిలోమీట‌ర్ల మేర నేరుగా నీటిని మ‌ళ్లిస్తారు.

రెండో విధానంలో ఉద‌య‌స‌ముంద్ర నుంచి 15 లేదంటే 20 కిలోమీట‌ర్ల త‌ర్వాత 90 కిలోమీట‌ర్ల మేర సొరంగాన్ని త‌వ్వ‌టం. ఒక‌వేళ ఈ ప‌ద్ద‌తికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓకే చెప్పేస్తే సాగునీటి ప్రాజెక్టుల‌లో ఇదే అతి పెద్ద సొరంగం అవుతుంది.

గోదావ‌రి నీటిని శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పంపే విధానానికి సంబంధించిన అధ్య‌య‌నం ఒక కొలిక్కి వ‌స్తున్నా.. దీని ఖ‌ర్చు విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్ప‌డిన త‌ర్వాత భారీ ఎత్తున అప్పు భారం పెరిగిపోయిన వేళ‌.. అదే ప‌నిగా ఖ‌ర్చు పెంచుకుంటూ పోవ‌టం స‌రికాదంటున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు కార్య‌రూపం దాలిస్తే రెండు రాష్ట్రాలకు ఆర్థిక భారం భారీగా పెరుగుతుందంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి.. రుణ భారం తీర్చే విష‌యంలో దృష్టిపెట్టాల్సింది పోయి.. ఇంత భారీ ప్రాజెక్టుల‌పైన ఎందుకు దృష్టి పెడుతున్నార‌న్న మాట వినిపిస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి భాగ‌స్వామ్య వ్యాపారం త‌ర‌హాలో తాజా డీల్ చేసుకునే ప‌రిస్థితి ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇంత భారీ మొత్తంలో ఎవ‌రెంత భ‌రించాల‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఎవ‌రెంత ప్ర‌యోజ‌నం పొందుతార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఈ విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మై.. ఇష్యూ వివాదాస్ప‌ద‌మైతే.. ప్ర‌జాధ‌నం భారీగా న‌ష్ట‌పోవ‌టం ఖాయం.

అన్ని బాగున్న ఇవాల్టి రోజున ఈ త‌ర‌హా ప్రాజెక్టుకు ఓకే అనుకోవ‌చ్చు. రేపొద్దున రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మధ్య స‌రైన సంబంధాలు లేక‌పోతే.. ఆ  రోజున పంచాయితీల మీద పంచాయితీలు చోటు చేసుకోవ‌టం ఖాయం. అదే జ‌రిగితే రూ.ల‌క్ష కోట్లు ఏమ‌వుతాయి? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. మ‌రి.. రూ.ల‌క్ష కోట్ల ప్రాజెక్టు విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News