ఎట్టకేలకు తుమ్మల బాధ బయటపడింది

Update: 2019-02-12 07:18 GMT
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు తనకు వెన్నుపోటు పొడిచినందుకే ఓటమిపాలయ్యానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత పార్టీ నేతలే తనను ఓడించి రాక్షసానందం పొందారని - వెన్నుపోటు రాజకీయాలు చేసేవారు ఎప్పటికి పైకి ఎదగలేరని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో తుమ్మల మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ జిల్లా అభివృద్ధిలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ తప్పు చేస్తే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. సర్పంచ్ లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మరో మూడునెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని సర్పంచ్ లు ఇంటింటికీ నల్లాలు బిగించేలా చూడాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని సర్పంచులందరికీ స్వయంగా శాలువాలు కప్పి సన్మానించారు.
Tags:    

Similar News