ఏమిటీ టెండర్ ఓటు..ఒక్కటి పడినా రీపోలింగ్ ఎందుకంటే?

Update: 2020-01-22 08:27 GMT
టెండర్ ఓటు. దీనిపై అవగాహన ఉన్నోళ్లు తక్కువే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ వి. నాగిరెడ్డి చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. టెండర్ ఓటు మీద సరికొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.  ఇంతకీ.. ఈ టెండర్ ఓటు అంటే ఏమిటి? దానికున్న ప్రత్యేకత ఏమిటి? టెండర్ ఓటు ఒక్కటి పడినా రీపోలింగ్ నిర్వహిస్తామని ఆయన ఎందుకు చెప్పారు? అన్నది చూస్తే..

ఎవరైనా ఒక ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చేసరికి తన ఓటు వేరే వారికి వేసేసి ఉంటే.. అటువంటి ఓటరుకు అవకాశం లేకుండా పోతుంది. ఇలాంటి సందర్భంలో తన ఓటు వేయాలని ఆ ఓటరు డిమాండ్ చేసే హక్కు ఉంది. సదరు ఓటరు తాను ఒరిజనల్ ఓటర్ ను అంటూ ప్రూఫులు చూపిస్తే.. ఎన్నికల అధికారి ప్రత్యేక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఓటు వేసిన తర్వాత ఒక కవరులో ఉంచి పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. దీన్నో టెండర్ ఓటు అంటారు.

ఇక.. నాగిరెడ్డి చేసిన తాజా ప్రకటన చూస్తే.. ఏ పోలింగ్ కేంద్రంలో అయినా ఒక్క టెండర్ ఓటు పడినా.. అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి ఓటు వేరే వాళ్లు వేసిన క్రమంలో టెండర్ ఓటు అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పిన ఆయన.. ఓటరు జాబితాలో ఫోటో ఉన్న నేపథ్యంలో దొంగ ఓట్లకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా జరుగుతున్న పుర ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ బూత్ లో 800 నుంచి వెయ్యి ఓట్లు మాత్రమే ఉండటం కారణంగా.. పది ఓట్లు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగానే టెండర్ ఓటు విషయంలో ఆయనీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మరి.. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న పుర ఎన్నికల్లో ఎన్ని టెండర్ ఓట్లు నమోదవుతాయో చూడాలి.
Tags:    

Similar News