ఏపీ కొత్త సీఎం ఎవరో చెప్పే నిఖార్సు అయిన జోస్యం !

ఈ ఎన్నికల పేరుతో ఇష్టం వచ్చిన నంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేస్తున్నారు.

Update: 2024-05-05 03:30 GMT

ఏపీలో ఎవరు కొత్త సీఎం అంటే చిలక జోస్యం నుంచి ఎలక జోస్యం దాకా అంతా తోచిన తీరున చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఇద్దరే ఉన్నారు. అయితే జగన్ లేకపోతే బాబు. అందువల్ల ఏదో పేరు చెబితే కరెక్ట్ అయిన వారంతా చూశారా మా జోతిష్య పాండిత్యం అని బింకాలు పోవడానికి ఎంతో వీలుంది. ఇక సర్వేలు చిత్ర విచిత్రాలు.

ఈ ఎన్నికల పేరుతో ఇష్టం వచ్చిన నంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేస్తున్నారు. తమాషా ఏంటి అంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటే కొందరు సర్వేశ్వరులు అత్యుత్సాహం చూపిస్తూ 178, 189 ఆ పైదాక నంబర్లు పెంచుకుంటూ పోతున్నారు. అంటే లెక్క కూడుకోవడం చేయకుండా వట్టి నంబర్లు వీళ్ళకు ఇంత వాళ్ళకు ఇంత అని వడ్డించేస్తున్నారు అన్న మాట.

ఇలాంటి ఫేక్ సర్వేల నడుమ ఏపీ రాజకీయం మూకుడులో వేగుతున్న కూరగాయలా కాకెత్తిపోతోంది. ఇంతకీ ఎవరు గెలుస్తారు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే ఈ జోస్యాలు సర్వేల మధ్య ఒక నిఖార్సు అయిన జోస్యం బయటకు వచ్చింది. దాన్ని నమ్ముదామా అంటే నమ్మక తప్పదు అంటున్నారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి.

ఆయన సెటైరికల్ గా చంద్రబాబు మీద ట్వీట్లు చేస్తూంటారు. తాజాగా ఆయన వేసిన ట్వీట్ తో ఏపీలో కొత్త సీఎం ఎవరో భారత వాతావరణ శాఖ ద్వారా చెప్పించారు. ఈ ఏడాది వానలు పుష్కలంగా కురుస్తాయని వర్షాభావ పరిస్థితులు అసలు ఉండవని ఐఎండీ తన నివేదికను ఇచ్చింది. దానిని పట్టుకుని విజయసాయిరెడ్డి బాబు మీద టీడీపీ మీద సెటైర్లు పేల్చారు.

Read more!

ఈసారి వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో చంద్రబాబు గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని అంటూ ఆయన రూపొందించిన ఒక మీమ్ ని షేర్ చేశారు. సాధారణంగా చంద్రబాబు వస్తే వానలు పడవని కరవు ఉంటుందని వైసీపీ నేతలు తరచుగా విమర్శిస్తూంటారు. వైఎస్సార్ టైం నుంచి ఇది ఉంది. వైఎస్సార్ అయితే వరుణుడు మా పార్టీ అని కలిపేసుకున్నారు కూడా.

దీంతో పాటుగా ఇటీవల జగన్ చోడవరం లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ చంద్రబాబు వస్తే పధకాలు మాత్రమే కాదు వానలు కూడా ఆగిపోతాయని రైతన్నలకు సున్నితంగా హెచ్చరించారు. ఇవన్నీ బాబు మీద వైసీపీ వేసే పంచులే. మరి ఇపుడు దాన్నే పట్టుకుని విజయసాయిరెడ్డి బాబు మీద ఈ మీమ్ రూపొందించి మరీ సెటైర్లు పేల్చారన్న మాట. దీఎనికి టీడీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూడాలి.

ఇక ఈ జోస్యం చూస్తే వానలు పడితే జగన్ కే అధికారమా చంద్రబాబుకు అవకాశాలు లేవా అన్న చర్చ కూడా రాజకీయంగానూ కొందరిలో సాగుతోంది. సగటు జనాల విషయం చూస్తే ఇంతలా ఎండలు మండిపోతున్న వేళ వానలు కురియాలని చల్లంగా అంతా ఉండాలని కోరుకుంటున్నారు. మరి బాబు అధికారంలోకి వస్తే వానలు పడవా అంటే ఆయన టైం లోనూ కురిసాయి. మరి ఇదంతా ఏమిటీ అంటే రాజకీయ విమర్శలుగానే చూడాలని అంటున్నారు. వాన రాకడకు ప్రభుత్వ ఏర్పాటుకూ పోలిక ఏంటి అన్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News