టెకీలు వ‌ద్దు..కూలీలు కావాలంటున్న ట్రంప్

Update: 2017-07-21 06:39 GMT
సాఫ్ట్‌ వేర్ స‌హా ఇత‌ర‌ వృత్తి నిపుణుల విష‌యంలో క‌త్తిగ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు సాదాసీదా కూలీల‌కు మాత్రం త‌లుపులు బార్లా తెరిచింది. నిపుణుల‌కు ఇచ్చే హెచ్‌1బీ వీసాలకు గేట్లు పెట్టిన ట్రంప్ కూలీల‌కు సంబంధించిన హెచ్‌2బీ వీసాల విష‌యంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. విదేశీయులకు 15,000 అదనపు వీసాలను ఇవ్వాలన్న నిర్ణయాన్ని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి సీజనల్‌గా పనిచేసే తక్కువ జీతగాళ్ల కోసం ఈ ప్రకటన ఆ శాఖ చేసింది. ఇది అధ్యక్షుడు ట్రంప్ వల్లెవేస్తున్న ‘హైర్ అమెరికన్’ నినాదానికి సంబంధం లేని ప్రకటన. మత్స పరిశ్రమ కేంద్రాలు - ఆతిథ్యం తదితర పరిశ్రమల నుంచి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కోసం ఒత్తిడి పెరిగిన ఫలితం ఇదని భావిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగానికి మా మూలుగా కేటాయించిన హెచ్ -2బి వీసాల సంఖ్యకంటే ఇది 45 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఆ శాఖ సీనియర్ అధికారులు విలేకరులకు ఈ విషయం తెలిపారు. సీఫుడ్స్ - టూరిజం - నిర్మాణం తదితర సీజనల్ పరిశ్రమలకు కావలసిన తాత్కాలిక కార్మికులను సమకూర్చడానికి ఇలా వీసాల సంఖ్య పెంచారు. ఆయా రంగాల్లో వ్యవసాయ ప్రయోగశాలల రంగం లేదు. ఈ అదనపు వీసాల దరఖాస్తు కార్యక్రమం ఈ వారం మొదలు కావచ్చు. విదేశీ కార్మికులను చేర్చుకోని పక్షంలో శాశ్వత నష్టం సంస్థలకు కలుగుతుందని ధ్రువీకరణ ఇచ్చాకే అదనపు వీసా దరఖాస్తులు పెట్టుకోవాలి. తాము ఒప్పుకున్న ఆర్డర్ మేరకు పనులు వేరే విధంగా సాగించజాలమని ధ్రువీకరిస్తూ ఆయా సంస్థలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదా తమకు కలిగి ఆర్థిక నష్టాన్ని రుజువు చేసే ఆధారాలను సమర్పించాల్సి వస్తుందని అధికార్లు వివరించారు.
Read more!

కాగా,  ఇది ట్రంప్ ప్రకటిస్తున్న ‘అమెరికన్లకే ఉద్యోగాలు’ నినాదంతో ఏ విధంగా సరి తూగుతోందని అడగగా ట్రంప్ తన ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ఈ అదనపు వీసాలు కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అమెరికా వ్యాపార సంస్థలు నష్టపోకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమెరికా కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి చెప్పారు. అమెరికా కార్మికులను రక్షించడానికి, అమెరికాలోకి వలసల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపకరించే నిర్ణయం ఇదని వైట్ హౌస్ కార్యదర్శి చెప్పారు. వ్యాపార సంస్థల అదనపు వీసా దరఖాస్తులను మొదట వచ్చిన వాటికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన ఆమోదించడం జరుగుతుందని వివ‌రించారు.
Tags:    

Similar News