డిప్యూటీ సీఎం ముందు టీఆరెస్ నేతల ఫైట్

Update: 2016-09-30 08:11 GMT
తెలంగాణలో పాలక టీఆరెస్ ప్రస్తుతం మేడిపండులా ఉందని... నేతల మధ్య పొసగడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా టీఆరెస్ ప్రజాప్రతినిధులే ప్రజల ముందు మాటల తూటాలు పేల్చుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తాజా పరిణామాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ  - జనగామ ఎమ్మెల్యేలు ప్రజల ముందే ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని.. ఇప్పుడిప్పుడే విభేదాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు.

కాగా జనగామ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు గురువారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి  శంకుస్థాపనలు చేశారు. ఆ తరువాత పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గమైన జనగామ ప్రాంత అభివృద్ధికి భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ కృషి చేయాలని - అందుకు నిధులు కేటాయించాలని కోరుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన చిట్టాను ఎంపికి సమర్పించారు. దీంతో ఎంపి బూర నర్సయ్య ఒక్కసారిగా ఫైరయ్యారు.  జనగామ కేవలం నియోజకవర్గం మాత్రమే కాదని... తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి సైతం వస్తుందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.  అయితే తనకు యేటా రూ.5కోట్ల నిధులు మాత్రమే ఉంటాయని, తన నియోజకవర్గ పరిధిలో రూ. ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయని - ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఇలా  బహిరంగ సమావేశంలో నిధులు అడగటం సరైన పద్ధతి కాదని ఆయన సీరియస్ అయ్యారు.

 దీనికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెస్పాండవుతూ.. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం తాను కృషి చేస్తున్నానని, అందులో భాగంగానే ఎంపిని నిధులు కేటాయించాలని అడిగానని... దానికి ఫీలయిపోతే ఎలా అన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ - ఎమ్మెల్యే కూడా ఆగ్రహావేశాలకు గురయ్యారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని గుర్తించిన కడియం వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ చల్లార్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News