అఫిషియ‌ల్ః టీఆర్ ఎస్ నుంచి వారిద్ద‌రే పెద్ద‌ల స‌భ‌కు

Update: 2016-05-26 17:22 GMT
ఊహాగానాలకు తెర పడింది. తెలంగాణ అధికారపక్షం రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. రెండు రోజులు ఫాంహౌస్ లో ఉండి లెక్కలన్నీ చూసుకుంటూ.. తూకంలో తేడా రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముందుగా అనుకున్నట్లే పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావును రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న డి శ్రీనివాస్ పేరును ప్రకటించి కాసింత ఆశ్చర్యానికి గురి చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొందిన పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా.. ఎంపిక విషయంలో తనదైన చతురతను ప్రదర్శించారు కేసీఆర్.

కేంద్రంలో పలుకుబడి.. పరిచయాలున్న నాటి కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ ను రాజ్యసభకు పంపటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్.. తనను నమ్ముకున్న వారికి కాస్త ఆలస్యమైనా పదవులు మాత్రం పక్కా అన్న సందేశాన్ని ఇచ్చేలా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ను నమ్ముకొని ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతంను రాజ్యసభకు పంపించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఇద్దరు రాజ్యసభ సభ్యుల్ని సులువుగా పంపించే వీలున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాజ్యసభ సభ్యులైనట్లేనని చెప్పొచ్చు. తన ఎంపికలో వ్యూహ చతురతను ప్రదర్శించిన కేసీఆర్ మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మంత్రి తుమ్మల స్థానంలో ఎమ్మెల్సీ పదవికి దివంగత సీఎం వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన పరీదుద్దీన్ ను ఎంపిక చేశారు. దీంతో.. ఖాళీ అయిన ముఖ్యమైన పదవులకు ఎంపిక పూర్తి అయినట్లైంది.
Tags:    

Similar News