సూపర్ స్టార్ ని కాంగ్రెస్ లీడర్ కలిశారే..

Update: 2016-09-23 06:06 GMT
కొన్ని భేటీలు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి భేటీనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ తిరునావుక్కరసర్ ఆకస్మికంగా భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్న వేళ చోటు చేసుకున్న ఈ భేటీ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమైన నేపథ్యంలో తమ భేటీ స్నేహపూర్వకంగా సాగిందే తప్పించి.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. రజనీతో తనకు మంచి స్నేహం ఉందన్న ఆయన.. కబాలి విజయం సాధించిన నేపథ్యంలో రజనీకాంత్ కు తాను శుభాకాంక్షలు చెప్పినట్లుగా వెల్లడించారు. తాను కబాలి విజయం మీద అభినందనలు తెలుపగా.. తాను తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల్ని చేపట్టిన అంశంపై రజనీ తనకు శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు.

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో రజనీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భేటీ కావటం గమనార్హం. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్న ఒక్క విషయం మాత్రం లాజిక్ కు సరిపోవటం లేదనే చెప్పాలి. కబాలి విజయం సాధించిన చాలా కాలమే అయ్యింది. అలాంటిది ఉన్నట్లుండి శుభాకాంక్షలు చెప్పటానికి రజనీని కలవాల్సిన అవసరం ఏముందన్నది ఒక పాయింట్ అయితే.. తిరునావుక్కరసర్ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ గా పదవి చేపట్టి చాలాకాలమే అయ్యింది. ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు కలిసి మరీ శుభాకాంక్షలు చెప్పుకోవటం ఏమిటి చెప్మా..?
Tags:    

Similar News