రెండు రోజుల్లో ముగ్గురు అగ్రనేతలకు ప్రమాదం

Update: 2016-10-26 17:30 GMT
వారు ముగ్గురూ ముగ్గురే... అందులో ఇద్దరు రాజకీయంగా ప్రత్యర్థులైతే.. మూడో వ్యక్తి  రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి.  రెండు రోజుల వ్యవధిలో ముగ్గురూ వేర్వేరు ప్రమాదాలకు గురయ్యారు. ఒకరు ప్రభుత్వ దాడిలో గాయపడగా.. ఇంకొకరు అనుకోని ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. మరోనేత త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  వేర్వేరు సిద్ధాంతాలున్నా ప్రజల్లో పట్టున్నముగ్గురు అగ్రనేతలు ఇలా ఒక్కసారి ప్రమాదం అంచులకు వెళ్లడం చర్చనీయమవుతోంది.

సోమవారం జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తీవ్రంగా గాయపడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మల్కాన్ గిరి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టులు పెద్దసంఖ్యలో మరణించారు. ఎన్ కౌంటర్ సమయంలో అక్కడే ఉన్న అగ్రనేత ఆర్కే మాత్రం గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. అసలు ఎన్ కౌంటర్ కూడా ఆర్కే లక్ష్యంగానే జరిగినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి - హోంమంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రమాదం నుండి బయటపడ్డారు. కాకినాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించడానికి మంగళవారం ఉదయం వెళ్లిన అయన లిఫ్టు ప్రమాదంలో గాయపడ్డారు. కిందకు వస్తుండగా లిఫ్ట్ ఫెయిలై కిందకు పడిపోవతంతో చినరాజప్ప సహా కొందరు గాయపడ్డారు.  ఘటనా సమయంలో చినరాజప్ప తీవ్రమైన షాక్‌ కు గురయ్యారు. చాలాసేపటి వరకు ఆయన తేరుకోలేకపోయారు.

మంగళవారమే మరో ముఖ్య నేత కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్నూలు యువభేరికి హాజరైన ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్‌ హైదరాబాద్‌ కు తిరిగి వస్తున్న సమయంలో  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద జగన్ కారు టైర్ పంక్చర్ అయింది.  వేగంగా వస్తున్న సమయంలోనే టైర్ పంక్చర్ అవడంతో వాహనం రోడ్డు పక్కకు లాగేసింది. ప్రక్కన ఏ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని అదుపుచేయగలిగారు. సాధారణంగా వేగంగా వస్తున్న వాహనం పంక్చర్ అయినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. డ్రైవర్ చాకచక్యం వల్ల ప్రమాదాన్ని నివారించగలిగారు. దాదాపు 20 నిమిషాల పాటు జగన్ రోడ్డు మీద వేచి ఉన్నారు. అనంతరం అదే కారులో జగన్ హైదరాబాద్‌ బయలుదేరారు.  ఇలా ముగ్గురు అగ్రనేతలు ప్రమాదాల్లో చిక్కుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News