మూడు రాజధానుల బిల్లు మళ్ళీ రెడీ

Update: 2021-12-03 04:52 GMT
రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు మూల కారణమైన మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రెడీ చేస్తోంది. సాంకేతిక కారణాలతో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యనే అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్నది. విచారణ దాదాపు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్న దశలో బిల్లుల ఉపసంహరణకు ప్రభుత్వం చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

బిల్లుల రూపకల్పనలో సాంకేతిక, న్యాయపరమైన లొసుగులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దాంతో కోర్టు విచారణలో అంతిమ తీర్పు ఎలా ఉండబోతోందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించిన కారణంగానే హఠాత్తుగా బిల్లులను ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తూ బిల్లును సమగ్రంగా, మరింత పటిష్టంగా తీసుకొస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానుల బిల్లును ఎప్పుడు తెచ్చేది జగన్ చెప్పలేదు.

ఇదే విషయమై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వచ్చే మార్చిలో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం తీసుకొస్తోందని ప్రకటించారు. మంత్రి ప్రకటనను గమనిస్తే ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రక్రియ మొదలైనట్లు అర్ధమవుతోంది. ఉపసంహరించుకున్న బిల్లుల్లో ఉన్న సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు ఏమిటో కూడా ప్రభుత్వం చెప్పలేదు. అలాంటి ఇబ్బందులను అధిగమించి తొందరలోనే ఫ్రెష్ గా మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు.



జగన్ ప్రకటించిన తర్వాత కొత్తగా తయారు చేయబోయే బిల్లుపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రామపంచాయతీ నుండి జిల్లా పరిషత్తుల వరకు మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానాలు చేయిస్తారని, ప్రజాసంఘాల మద్దతు కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయి నుంచి మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానాలు చేయిస్తారని అందుకు కనీసం ఏడాది కాలం పడుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

కానీ మంత్రి బాలినేని మాత్రం వచ్చే మార్చిలోనే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారంటే మొత్తం ప్రక్రియను ప్రభుత్వం చాలా స్పీడుగా నడుపుతోందని అర్ధమవుతోంది. ఈ స్పీడుతోనే ప్రభుత్వం అనేక అంశాల్లో ఎదురుదెబ్బలు తిన్నది. కాబట్టి కాస్త ఆలస్యమైనా బిల్లు రూపకల్పనలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జగన్ను కోరుతున్న నేతలు కూడా ఉన్నారు. సరే మూడు రాజధానుల బిల్లుల విషయంలో ఎవరెన్ని మాట్లాడినా జగన్ నిర్ణయమే అంతిమం అన్న విషయం తెలిసిందే. చూద్దాం మంత్రి చెప్పినట్లు మార్చంటే ఎంతో దూరంలో లేదు కదా.
Tags:    

Similar News