ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిదా చేశాడు

Update: 2021-01-06 11:01 GMT
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మనవళ్లు, ముని మనవళ్ల వరకు సంపాదించే నేతలు మన దేశంలో కోకొల్లలు. కానీ సంపాదన కంటే ప్రజాసేవే మిన్న అనేవారు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో ఒక్కడే ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. అసలు తానొక ఎమ్మెల్యేనని ఎప్పుడూ ఆయన డాబూ దర్శం ప్రదర్శించడు. సాధారణ మనిషిలానే జీవనం సాగిస్తుంటాడు.

తాజాగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే హైవే పక్కన ఓ టిఫిన్ బండి వద్ద సాధారణ మనిషిలా టిఫిన్ చేస్తున్న వ్యక్తి వెనుకాల గన్ మెన్లు పెద్ద గన్ లతో టిఫిన్ తింటున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. గన్ మెన్లు ఉన్నారు.. నేత ఏరి అని వెతకగా.. వారి ముందే సాధారణ కుర్చీలో కూర్చొని టిఫిన్ తింటున్నాడు ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఆ టిఫిన్ సెంటర్ కు వచ్చిన వాళ్లందరికీ అసలు ఆయనో ఎమ్మెల్యే అని.. ఇంత సింపుల్ గా రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్నాడన్న విషయం కూడా తెలియదు. ఆయన వ్యవహారం చూసి ఆశ్చర్యపోవడం ఇప్పుడు వారి వంతైంది.

ఆత్రం సక్కు కొత్త ఎమ్మెల్యేం కాదు.. ఇప్పటికే రెండు సార్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినా చాలా సాదాసీదాగా ప్రజలతో కలిసిపోయే ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నాడు. పదవులు శాశ్వతం కాదని.. ప్రజలకు సేవ చేయడమే శాశ్వతమని నమ్మిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే హోదా ఉన్నా ఇప్పటికీ అందరు కార్యకర్తలు, ప్రజల ఇంటికెళ్లి వారితో కలిసిపోయి సాధారణ పౌరుడిలా భోజనం చేస్తుంటారు. వాళ్ల కష్టసుఖాలు తెలుసుకొని తీరుస్తుంటాడు. వాళ్లు ఏది పెడితే అది తింటాడు. అంత సింపుల్ గా ఉంటాడు కాబట్టే రెండు సార్లు గెలిచాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టిఫిన్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News