రోడ్డుపై నిందితులను నడిపిస్తున్న పోలీసులు.. డీజీపీ నుంచి షాకింగ్ రీజన్..!
అవును... ఇటీవల కాలంలో పలువురు నిందితులను పోలీసులు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు.;
ఏదైనా నేరం జరిగిందనే ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు సదరు వ్యక్తి నిందితుడు మాత్రమే.. అతడు దోషా, నిర్దోషా అనేది గౌరవ న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి! అయితే.. ఈ లోపే వారి గౌరవానికి భంగం కలిగించేలా.. ముఖానికి కనీసం మాస్కులు లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. దీనిపై ఇటీవల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా.. వారికి తగిన శాస్తే జరిగింది.. ఇప్పటికైనా పరువు పోయి, బుద్ది తెచ్చుకుని, బుద్దిగా ఉంటారు అని కొంతమంది అంటుంటే... ఇది ఏమాత్రం సమర్థనీయమైన చర్య కాదని.. నిందితుల ప్రైవసీని కాపాడాలని.. దోషులుగా నిర్ధారించబడిన తర్వాత సంగతి వేరని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి దీనికి ఓ షాకింగ్ రీజన్ రావడం గమనార్హం.
అవును... ఇటీవల కాలంలో పలువురు నిందితులను పోలీసులు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇటీవల కొంతమంది నిందితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి పాదాలపై లాఠీలతో పచ్చడి పచ్చడిగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే! ఇదే క్రమంలో ఇటీవల పలువురు నిందితులను పోలీసులు రోడ్లపై నడిపించుకుంటూ, చౌరాస్తాల్లో తిప్పుతూ కోర్టుకి తీసుకెళ్తున్నారు!
పైన చెప్పుకున్నట్లుగా వీటిపై భిన్నాబిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక - 2025 విడుదల చేసి, దానికి సంబంధించిన వివరాలను పంచుకుంటున్న నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఈ విషయంపైనే విలేకరుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా... ఇటీవల నిందితులను రోడ్లపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్నారు ఎందుకు అని జర్నలిస్టు అడిగారు.
అయితే.. దీనికి సమాధానంగా స్పందించిన డీజీపీ.. తమ వద్ద నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి పెట్రోలింగ్ వాహనాలు లేవని.. అందుకే వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లామని.. తాము కూడా వారితోపాటే నడిచామని బదులిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్ హరీష్ కుమార్ గుప్తా. ఈ సమాధానం ఆయన ఏ ఉద్దేశ్యంతో చెప్పినా.. దీనిపైనా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నేరాలు తగ్గాయి.. శిక్షలు పెరిగాయి!:
ఇక తాజాగా విడుదల చేసిన వర్షిక నేర గణాంక నివేదిక - 2025 ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గాయని.. అయితే, ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరిగాయని తెలిపారు. మొత్తంగా ఏపీలో నేరాలు 2024 కంటే 2025లో 6.17 శాతం మేర తగ్గాయని.. అదే సమయంలో శిక్షలు 6.51 శాతం మేర పెరిగాయని స్పష్టం చేశారు.