కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్.. అయినా అదనపు భారం పడదు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది!;

Update: 2025-12-30 07:33 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులపై కొత్తగా 'రోడ్ సేఫ్టీ సెస్' విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా... కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10శాతం రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది! అయినప్పటికీ వాహనదారులపై అదనపు భారం పడదని అంటున్నారు.

అవును... కొత్తగా వాహనం కొనాలనుకునేవారికి లైఫ్‌ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం చెల్లింపులకు తోడు ఇప్పుడు కొత్తగా మరో భారం పడనుంది! ఇందులో భాగంగా.. వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1963 నాటి ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్‌ ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా లైఫ్ ట్యాక్స్ ఉన్న వాహనాలపై ఆ పన్ను మొత్తంలో 10% అదనపు సెస్ ను వసూలు చేయనున్నారు. దీనివల్ల అదనంగా ఐదు నుంచి పది వేల రూపాయల వరకూ రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు!

అయితే.. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చు చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇందులో భాగంగా... ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా వసూలైన మొత్తాన్ని నేరుగా రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేయనున్నారు. ఈ నిధులను ప్రధానంగా రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులు, గుంతల పూడికలు, ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు, రహదారుల ఆధునీకరణ, మొదలైన వాటికి వినియోగిస్తారు!

ఈ నేపథ్యంలో... ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.22.5 కోట్ల చొప్పున ఏడాదికు దాదాపు రూ.270 కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా... రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద రహిత ప్రయాణాన్ని ప్రజలకు అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న కీలక ఉద్దేశ్యమని అంటున్నారు.

అయితే... ఇలా నూతన సంవత్సరంలో ఈ నూతన బాదుడుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దీనిపైనా వివరణ వచ్చింది. ఇందులో భాగంగా.. జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రస్తుతం వాహనాల ధరలు కొంత మేర తగ్గాయని.. అందువల్ల ఈ 10% సెస్ విధించడం వల్ల వాహనదారులపై పెద్దగా అధనపు భారం పడబోదని చెబుతున్నారు. తగ్గిన ధరలు, ఈ సెస్ పరస్పరం సర్దుబాటు అవుతాయని అభిప్రాయపడుతున్నారు.

కాగా... ఆంధ్రప్రదేశ్ లో నెలకు సుమారు 73,000 కొత్త వాహనాలు నమోదవుతున్నాయి. ఇక, ఇటీవల మోటారు వాహనాలపై జీఎస్టీని 28% నుండి 18%కి తగ్గించిన సంగతీ తెలిసిందే.

Tags:    

Similar News