ఈసారి హోలీ లేనట్లే.. తాజాగా ఆంక్షలు జారీ చేసిన పోలీసులు

Update: 2021-03-27 09:54 GMT
ఇప్పటికే గుజరాత్.. మహారాష్ట్రలలో హోలీ వేడుకల్ని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం హోలీ వేడుకల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుందన్న మాట బలంగా వినిపించినా.. శుక్రవారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటివేళ.. ఈ రోజు (శనివారం) పోలీసులు హోలీ వేడుకలపై ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుక ఎక్కువగా కనిపించేది హైదరాబాద్ లోనే. మహానగరంలోని గేటెడ్ కమ్యునిటీ వారు నివసించే చోట.. విల్లాలు.. అపార్ట్ మెంట్లతో పాటు.. ఉత్తరాది వారు ఎక్కువగా ఉండేచోట్ల వేడుకలు భారీగా సాగుతుంటాయి. అయితే.. పాజిటివ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఆంక్షల్ని జారీ చేశారు.

హోలీ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు మూసివేయాలన్న  ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు.. హోలీ వేడుకల్ని నిర్వహించే  ఈవెంట్ మేనేజర్స్ తో పాటు.. హాస్టల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి వేడుకలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు.. రోడ్లపై వెళ్లే వ్యక్తులపైనా.. వాహనాలు.. స్థలాలపైనా రంగులు.. రంగునీళ్లు చల్లొద్దని.. టూవీలర్.. కార్లలో గుంపులుగా తిరుగుతూ హడావుడి చేసే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరింరారు. ఈ సారికి హోలీని కరోనా ఖాతాలో రాసేసి..  వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే సరి.
Tags:    

Similar News