భోగాపురం ఎయిర్ పోర్టుకు రెక్కలు రెడీ !

ఇక అడవివరం శొంఠ్యాం రహదారి తప్ప మిగతా అన్ని రహదారులకు జాతీయ రహదారి కనెక్టివిటీకి అంగీకారం లభించిందని అధికారులు అంటున్నారు.;

Update: 2026-04-09 23:30 GMT

ఉత్తరాంధ్రకు తలమానికం అయిన భోగాపురం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొందరలోనే ఆపరేషన్స్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాది జనవరి 4న ట్రయల్ రన్ పూర్తి చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి శుభారంభం చేసిన భోగాపురం ఎయిర్ పోర్టు తొందరలోనే పూర్తి స్థాయి ఆపరేషన్స్ కి అవసరం అయిన హంగులు సిద్ధం చేసుకుంటోంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్ళాలంటే రద్దీ పెద్దగా లేకపోతే గంటా 12 నిముషాలు పడుతుంది. 46 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ పోర్టు ఉంది. అందుకే ఈ ఎయిర్ పోర్టు నుంచి కొత్తగా అప్రోచ్ రోడ్లను వేసి మరీ వీలైనంత వరకూ రద్దీని క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న ఏడు ప్రాధాన్య రహదారులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎయిర్ పోర్టు కనెక్టివిటీ :

ఇక భోగాపురం నుంచి ఇతర ప్రాంతాలకు ఎయిర్ పోర్టు కనెక్టివిటీ కోసం విఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్ అండ్ బి వంటి సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఏడు కీలక రహదారి పనులు ప్రస్తుతం అక్కడ శరవేగంగా కొనసాగుతున్నాయి. భీమిలీ దగ్గర ఉన్న తిమ్మాపురం నుంచి విశాఖ శివారు అయిన మారికవలస వరకు 6.3 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావడానికి చేరువలో ఉన్నాయి. అలాగే అదే విధంగా అడవివరం నుంచి శొంఠ్యాం వరకు నిర్మిస్తున్న ఆరు లైన్ల ప్రధాన రహదారి నగరానికి కీలకంగా మారబోతోంది. అడవివరం శొంఠ్యాం రహదారిలో కొంతభాగం అటవీ భూమి ఉండటంతో అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు త్వరలో లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

సగానికి పైగా పూర్తి :

ఇక ఈ ఎయిర్ పోర్టు కనెక్టివిటీ రోడ్లు సగానికి పైగా పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. నేరళ్ళవలస కొత్తవలస రహదారి 65 శాతం ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తవుతోంది. అలాగే బోయపాలెం నుంచి కాపులుప్పాడ వరకు నాలుగు లైన్ల రహదారి పనులు 66 శాతం మేర పూర్తయ్యాయని ఇవి కూడా ఏప్రిల్ చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక భీమిలి దొరతోట రహదారిని 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపకొండ పెందుర్తి రహదారి పనులు విఎంఆర్డీఏ జీవీఎంసీ కలసి చేపడుతున్నాయి. మే నెల చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. అలాగే వేపగుంట నుంచి జుత్తాడ వరకు రహదారి పనులు జూన్ నాటికి పూర్తవుతాయని అంటున్నారు.

అద్భుతమైన ప్రయాణం :

ఇక అడవివరం శొంఠ్యాం రహదారి తప్ప మిగతా అన్ని రహదారులకు జాతీయ రహదారి కనెక్టివిటీకి అంగీకారం లభించిందని అధికారులు అంటున్నారు. ఈ కనెక్టివిటీ రోడ్లు అన్నీ పూర్తి అయితే ఎక్కడ నుంచి అయినా భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది, అంతే కాదు అద్భుతమైన ప్రయాణం అనుభూతిని కూడా పొందుతారు అని అంటున్నారు ఇక కేవలం ఎయిర్ పోర్టు కనెక్టివిటీకి మాత్రమే కాదు ఈ రహదారుల వల్ల మొత్తం ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం బాగా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. జూన్ నాటికి ఈ మొత్తం పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక వీటికి అదనంగా భారీ వంతెనల నిర్మాణ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News