వైసీపీలో 'కలివిడి'.. అంతంతే..!
వైసీపీలో కలివిడి ఎలా ఉంది? నాయకుల మధ్య సఖ్యత ఎలా ఉంది? అంటే.. గత కొన్నాళ్లుగా ఈ విషయంలో నేతి బీరచందంగానే ఉందన్న చర్చ జరుగుతోంది.;
వైసీపీలో కలివిడి ఎలా ఉంది? నాయకుల మధ్య సఖ్యత ఎలా ఉంది? అంటే.. గత కొన్నాళ్లుగా ఈ విషయంలో నేతి బీరచందంగానే ఉందన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేతగా.. జగన్ పార్టీ నాయకులకు శ్రేణులకు పిలుపునిచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతున్నారు. అయితే.. నిన్న మొన్నటి వరకు జరిగిన పీపీపీ విధానం సహా.. ఇతర కార్యక్రమాలపై నాయకుల స్పందన ఆశించినట్టుగా లేదని తెలుస్తూనే ఉంది. దీనిపై కూడా పార్టీ తరఫున ఆదేశాలు వెళ్లాయి. సరిగా పనిచేయాలన్న సూచనలు కూడా వచ్చాయి.
అయినా.. పెద్దగామార్పు కనిపించలేదు. ఇక, తాజాగా ఓ పత్రికలో వచ్చిన కథనంలో వైసీపీ నాయకుల సతీమణులను కించపరిచారన్న కారణంగా.. లేవనెత్తిన నిరసనలకు పార్టీలో ఆశించిన స్పందన వచ్చిందా? అంటే.. కొన్ని కొన్ని జిల్లాల్లో బాగానే వున్నా.. కీలకమైన విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కడా ఆశించిన మేరకు స్పందన రాలేదు. వాస్తవానికి విశాఖలో మంచి స్పందన రావాల్సి ఉంది.
మాజీ మంత్రులు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ.. కార్యకర్తలను తీసుకురావడంలో విఫలమయ్యారు. ఇక, కర్నూలులోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో నాయకులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. మొత్తంగా ఏపీలో వైసీపీ బలం ఎంత ఉంది? ఎలా ఉంది? అనే విషయాల్లో క్లారిటీ వచ్చింది. విజయవాడలోఫర్వాలేదని అనిపించినా.. నియోజకవర్గావారీగా చూసుకుంటే ఒకింతతేడా కొట్టింది.
ఇదే పరిస్థితి గుంటూరు, నెల్లూరు, ప్రకాశంలోనూ కనిపించింది. నాయకుల మధ్య సయోధ్య లేదన్నది స్పష్టమైంది. ఇతర కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా కీలకంగా తీసుకున్న తాజా కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలోనూ నాయకులు వెనుకబడడం.. ఆధిపత్య ధోరణులు.. స్థానిక బలాబలాలు వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక మారుతారా? అనేది చూడాలి. ఇప్పటికైతే.. కలివిడి అంతంతమాత్రమేనన్నది స్పష్టమవుతోంది.