వాట్సాప్‌లో సరికొత్త విప్లవం: ‘గ్రీన్ డాట్’ ఫీచర్‌తో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఒక్క చూపుతోనే..!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘వాట్సాప్’ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు రాబోతోంది.

Update: 2026-06-19 09:33 GMT

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘వాట్సాప్’ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు రాబోతోంది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు.. సమయాన్ని ఆదా చేసేందుకు వీలుగా ‘గ్రీన్ డాట్’ అనే సరికొత్త ఆన్‌లైన్ ఇండికేటర్ ఫీచర్‌ను సంస్థ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షల దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం ఎవరు యాక్టివ్‌గా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువు కానుంది.

చాట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు

ప్రస్తుతం వాట్సాప్‌లో మనకు కావలసిన వారు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో తెలియాలంటే.. వారి చాట్ విండోను ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత ప్రొఫైల్ పేరు కింద ‘ఆన్ లైన్ ’ అని పడేవరకు వేచి చూడక తప్పడం లేదు. కానీ ఈ కొత్త గ్రీన్ డాట్ ఫీచర్‌తో ఈ తలనొప్పి పూర్తిగా తొలగిపోనుంది.

ఇకపై ఆన్‌లైన్‌లో ఉన్న యూజర్ల ప్రొఫైల్ పిక్చర్ (డీపీ)పై ఒక చిన్న పచ్చటి చుక్క కనిపిస్తుంది. దీనివల్ల చాట్ లిస్ట్‌ను చూస్తూనే ఎవరు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నారనేది ఒక్క చూపులోనే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటికే మెటా అనుబంధ యాప్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో ఈ తరహా ఫీచర్ విజయవంతంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా సౌకర్యాన్ని వాట్సాప్‌లోకి కూడా తీసుకువస్తున్నారు.

ప్రత్యేకంగా ‘రీసెంట్లీ ఆన్ లైన్’ సెక్షన్

ఈ అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్ మరో ఆసక్తికరమైన మార్పును కూడా పరిచయం చేయనుంది. చాట్ స్క్రీన్‌లో ప్రత్యేకంగా ‘రీసెంట్లీ ఆన్ లైన్’ అనే సెక్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రస్తుతం లైవ్‌లో ఆన్‌లైన్ ఉన్నవారితో పాటు.. కొద్దిసేపటి క్రితం వరకు యాక్టివ్‌గా ఉండి వెళ్లిన వారి జాబితా కూడా కనిపిస్తుంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో మనకు త్వరగా రిప్లై ఇచ్చే అవకాశం ఉన్న వ్యక్తులను సులభంగా గుర్తించి వారికి వెంటనే మెసేజ్ పంపడానికి వీలవుతుంది. ముఖ్యంగా బిజినెస్ ఖాతాదారులకు.. నిరంతరం చాటింగ్ చేసేవారికి ఇది ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.

గోప్యతకు పెద్దపీట

కొత్త ఫీచర్లు వస్తున్నాయంటే వినియోగదారుల్లో ప్రైవసీ గురించిన ఆందోళనలు సహజంగానే తలెత్తుతాయి. అయితే వాట్సాప్ యూజర్ల గోప్యతకు ఎటువంటి భంగం కలగకుండా ఈ ఫీచర్‌ను డిజైన్ చేస్తోంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లో తమ ‘లాస్ట్ సీన్ & ఆన్ లైన్’ ప్రైవసీని ‘నోబడీ’ లేదా ‘మై కాంటాక్ట్స్ ఎక్స్ పెక్ట్’ ’ అని హైడ్ చేసుకున్న యూజర్లకు ఈ గ్రీన్ డాట్ వర్తించదు. అంటే ఎవరు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఇతరులకు చూపించకూడదని అనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌పై గ్రీన్ డాట్ కానీ, లేదా ‘రీసెంట్లీ ఆన్ లైన్’ లిస్ట్‌లో వారి పేర్లు కానీ ప్రదర్శించబడవు. దీనివల్ల ప్రైవసీపై వినియోగదారుల నియంత్రణ యథావిధిగా కొనసాగుతుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం ఈ సరికొత్త గ్రీన్ డాట్, రీసెంట్లీ ఆన్‌లైన్ ఫీచర్లు గూగుల్ ప్లే బీటా వెర్షన్‌లో కేవలం కొద్దిమంది పరీక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్కడ పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత రాబోయే కొన్ని వారాల్లో సాధారణ ఆండ్రాయిడ్ , ఐఓఎస్ వినియోగదారులందరికీ స్టేబుల్ అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయనున్నారు.

మొత్తానికి ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసే వాట్సాప్.. ఈసారి తీసుకురాబోతున్న గ్రీన్ డాట్ ఫీచర్‌తో చాటింగ్‌ను మరింత వేగవంతంగా సౌకర్యవంతంగా మార్చబోతోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News