మాగుంట మాట: కుమారుడా.. తనా..?
వచ్చే ఎన్నికల్లో తను కాదు.. తన కుమారుడు బరిలో నిలుస్తాడని ఆర్భాటంగా ప్రకటించిన ఒంగోలు ఎంపీ .. టీడీపీ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. అంతర్మథనంలో పడ్డారని తెలుస్తోంది.;
వచ్చే ఎన్నికల్లో తను కాదు.. తన కుమారుడు బరిలో నిలుస్తాడని ఆర్భాటంగా ప్రకటించిన ఒంగోలు ఎంపీ .. టీడీపీ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. అంతర్మథనంలో పడ్డారని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఆయన తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. స్థానికం గా ఉన్న పరిస్థతి అనుకూలంగా లేదని అంటున్నారు. మనసులో కోరిక ఉండడం వేరు.. క్షేత్రస్థాయిలో వాస్తవం వేరు. ఈ రెండు అంశాలుకూడా భిన్నంగా ఉంటాయి.
ఇప్పుడు మాగుంట ఫ్యామిలీలో కూడా ఇలానే చర్చ సాగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే రాఘవరెడ్డిని బరిలో నిలపాలని అనుకున్నారు. కానీ, చంద్రబాబు ఈ విషయంలో ఆలోచన చేయాలని సూచించడంతో శ్రీనివాసులు రెడ్డి వెనక్కి తగ్గారు. కానీ.. ఇప్పుడు మరోసారి తన కుమారుడికి అవకాశం ఇప్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనిని స్వయంగా ప్రకటించారు కూడా. కానీ.. ఇప్పుడు మాత్రం కొంత ఆలోచనలో పడ్డారని అనుచరులు చెబుతున్నారు.
ఏంటి కారణం..?
యువకుడిగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికలకు పోటీ చేయడం బాగానే అనిపించినా.. ఒంగోలు ప్రజల నాడి మాత్రం దానికి అనుగుణంగా అయితే కనిపించడం లేదు. ఇటీవల అంతర్గతంగా చేసిన సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది. రాఘవరెడ్డికి మాస్‌లో ఇమేజ్ తక్కువగా ఉందని తెలిసింది. పైగా స్థానికంగా కంటే కూడా.. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉండడం మరింత ఇబ్బందిగా మారింది. ఇది పార్టీపరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా రాఘవరెడ్డికి పెద్ద ఇబ్బందిని కలిగిస్తోంది.
నిజానికి మాగుంట ఫ్యామిలీకి ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. అయితే.. ఇటీవల కాలంలో మారుతున్న పరిణామాలను గమనిస్తే.. కేవలం ఇంటిపేరు చెప్పుకొన్నంత మాత్రాన గెలుస్తున్న పరిస్థితి లేదు. 2019, 2024 ఎన్నికల్లోనూ ఇది స్పష్ట మైంది. ఇప్పుడు మాగుంట పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయన కుటుంబా నికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. యువతలో చైతన్యం వచ్చింది. దీంతో మాస్ ఇమేజ్ కూడా మార్పుకోరుకుంటోంది. నిరంతరం ప్రజల మధ్య ఉండే వారికే అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే.. మాగుంట రాఘవరెడ్డి వెనుకబడినట్టు తెలుస్తోంది.