మేయిన్ పార్టీని వీడి.. సైడ్ పార్టీని పట్టుకున్న కవిత వ్యూహం ఏంటి..?
రాజకీయం అంటేనే ఎత్తుగడలు.. మరీ ముఖ్యంగా సొంత గూడు వదిలి బయటకు వచ్చిన నేతలు వేసే అడుగులు చదరంగంలో ఎత్తుల కంటే వేగంగా మారుతుంటాయి.;
రాజకీయం అంటేనే ఎత్తుగడలు.. మరీ ముఖ్యంగా సొంత గూడు వదిలి బయటకు వచ్చిన నేతలు వేసే అడుగులు చదరంగంలో ఎత్తుల కంటే వేగంగా మారుతుంటాయి. ఈ నెలలోనే ఎజెండాను ప్రకటిస్తానని చెబుతున్న మాజీ ఎంపీ కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సహజంగా కొత్త పార్టీ పెడితే అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం ఆనవాయితీ.. కానీ, కవిత మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్‌ను కాదని, బలహీనపడ్డ ‘కారు’ (బీఱర్ఎస్) వెంటే ఆమె ఎందుకు పడుతున్నారు..? ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లెక్కలేంటో చూద్దాం.
కవిత కాంగ్రెస్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు?
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఐకాన్ లీడర్‌గా ఎదిగారు. ఆయన ఇమేజ్ మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తుందన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇలాంటి సమయంలో బలంగా ఉన్న రేవంత్ రెడ్డిని కదిపితే అనవసరమైన ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఉండదని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి జోలికి వెళ్లకుండా, తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే కారు పార్టీని కంగారు పెట్టడం.
బీఆర్ఎస్ బలహీనతలే బలం!
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నో ప్రాజెక్టులు, పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ.. కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు ఆ పార్టీని దెబ్బతీశాయి. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌లో నాయకత్వ లేమి, అంతర్గత కలహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం, కేటీఆర్-హరీష్ రావు మధ్య విభేదాల వాదనలు వినిపిస్తుండడంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. ఈ అనిశ్చిత వాతావరణమే తనకు అనుకూలమని కవిత అంచనా వేస్తున్నారు.
టార్గెట్ ‘గులాబీ’ ఓటు బ్యాంకు
బీఆర్ఎస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ ఇప్పుడు నిరుత్సాహంలో ఉండడంతో, వారిని తన వైపు తిప్పుకోవాలన్నది కవిత పక్కా ప్లాన్. బీజేపీకి నాయకులు ఉన్నా క్షేత్ర స్థాయి ఓటు బ్యాంకు తక్కువగా ఉండడంతో, ఆమె దృష్టి అంతా బీఆర్ఎస్ కేడర్‌పైనే ఉంది. ‘కారు’లోని అసంతృప్త నేతలను, నాయకత్వం కోసం వెతుకుతున్న కార్యకర్తలను చేరదీయడం ద్వారా తన కొత్త పార్టీని బలోపేతం చేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు అదే పార్టీలో ఉండి, ఇప్పుడు అదే పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూడడం రాజకీయ చదరంగంలో ఒక భాగమే. కవిత వేస్తున్న ఈ 'రివర్స్ వ్యూహం' ఎంత వరకు ఫలమిస్తుంది..? కేసీఆర్ నిర్మించిన కోటలో ఆమె చీలిక తీసుకురాగలదా? అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఈ నెల 25న కవిత ప్రకటించబోయే జెండా, అజెండాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అంశాలు ఉంటాయన్నది కీలకం. కాంగ్రెస్‌ను కాదని బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం ద్వారా ఆమె తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చాలని చూస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కేడర్ ఆమె వైపు మొగ్గు చూపితే, రాష్ట్రంలో విపక్ష హోదా కోసం సరికొత్త పోరాటం మొదలవుతుంది. ఏదేమైనా కవిత వేస్తున్న ఈ ఎత్తుగడలు గులాబీ శ్రేణుల్లో మాత్రం గుబులు పుట్టిస్తున్నాయి.