2 గంటలు..100 మంది దెబ్బకు 88కోట్లు ఖాళీ

Update: 2016-05-24 07:57 GMT
కేవలం రెండే రెండు గంటల వ్యవధిలో రూ.88 కోట్ల భారీ మొత్తాన్ని చోరీ చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. జపాన్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ మహా చోరీ ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతోంది. నకిలీ కార్డులతో భారీగా చేపట్టిన ఈ ఆపరేషన్లో రూ.88 కోట్లు చోరీకి గురైనట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ మహా చోరీని చేధించటానికి జపాన్ పోలీసులు కిందామీదా పడుతున్న పరిస్థితి. ఆసక్తికరంగా మారిన ఈ చోరీలో వంద మందికి పైనే పాల్గొన్నట్లుగా భావిస్తున్నారు.

జపాన్ రాజధాని టోక్యో సహా పలు పట్టణాల్లో 1400 ఏటీఎంలను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తుల బృందం ఫోర్జరీ చేసిన క్రెడిట్ కార్డుల సాయంతో రూ.88 కోట్లు దోచుకోవటం గమనార్హం. దాదాపు వందకు పైగా అంతర్జాతీయ దుండగులు ఈ మహా చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఈ ఫోర్జరీ కార్డులు దక్షిణాఫ్రికాలోని ఒక బ్యాంకు నుంచి జారీ అయినట్లుగా జపాన్ పోలీసులు గుర్తించారు. ఫోర్జరీ చేసిన క్రెడిట్ కార్డుల సాయంతో చోటు చేసుకున్న ఈ మహా దోపిడీకి కారణమైన వారిని గుర్తించే పనిలో జపాన్ పోలీసులు బిజీబిజీగా ఉన్నారు.
Tags:    

Similar News