పోలీసులపై పెట్రోల్ పోసిన దొంగ.. ఎలాంటి శిక్ష పడిందంటే?

Update: 2019-11-09 07:20 GMT
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఉదంతం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ ఘటన తర్వాత.. పలు ప్రాంతాల్లో పెట్రోల్ పోస్తామన్న బెదిరింపులకు పాల్పడిన ఉదంతాలు వార్తల రూపంలో వస్తున్నాయి. అయితే.. ఈ పెట్రోల్ పోసే ట్రెండ్ మన దగ్గరే కాదు.. మనకంటే ముందుగా ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన కేసుపై తాజాగా అక్కడి కోర్టు తీర్పును ఇచ్చింది కూడా.

ఇంగ్లాండ్ లోని ఎసెక్స్ లోని బాసిల్డన్ కు చెందిన జాక్సన్ అనే 28 ఏళ్ల యువకుడు బైక్ దొంగతనానికి పాల్పడ్డాడు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడ్ని గుర్తించి రౌండ్ చేశారు. కొందరు వాహనాలతో వెంటాడితే.. మరికొంతమంది పోలీసులు హెలికాఫ్టర్ లో వెంటపడ్డారు.

చివరకు జాక్స్ ను రౌండ్ చేశారు పోలీసులు. తనను చుట్టుముట్టిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా తన దగ్గరున్న పెట్రోల్ డబ్బాలోని పెట్రోల్ ను పోలీసులపై గుమ్మరించి.. నిప్పు పెడతానని బెదిరించాడు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు పరుగులు తీశారు. అనంతరం జాక్సన్ ను మరో చోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ చోరీతో పాటు.. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసును నమోదు చేశారు.

ఈ కేసులో జాక్సన్ కు మూడేళ్ల జైలుశిక్షను విధించింది స్థానిక కోర్టు. ప్రాణాల్ని తీసే ప్రమాదకరమైన ఇంధనాన్ని వినియోగించినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోల్ అంటుకొని ఉంటే.. ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు పోయేవని జడ్జి పేర్కొన్నారు.

తాను పోలీసుల్ని చంపే ఉద్దేశం తనకు లేదని.. పట్టుబడతానన్న భయంతోనే తానీ పనిని చేసినట్లుగా జాక్సన్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరుతూ న్యాయమూర్తికి లేఖ రాశాడు. అయినప్పటికీ.. అతగాడి నేర తీవ్రత కారణంగా శిక్షను తగ్గించేందుకు కోర్టు నో చెప్పింది.
Tags:    

Similar News