మైనార్టీ హిందువులపై దాడులు జరిగితే నోళ్లు పెగలవేంది?

Update: 2021-10-19 04:15 GMT
మైనార్టీ.. ఎక్కడైనా మైనార్టీనే అవుతుంది. మెజార్టీల ఆగడాల్ని మైనార్టీలు ఎదుర్కొనే ఇబ్బందులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే వారంతా గడిచిన కొద్ది రోజులుగా మౌనంగా ఎందుకు ఉంటున్నారు? అక్కడెక్కడో చైనా.. రష్యాల్లో జలుబు వస్తే.. ఇక్కడ ముక్కులు తుడుచుకునే కమ్యునిస్టులు మొదలుకొని.. లౌకికవాదులుగా చెప్పుకునే అపర మేధావుల వరకు అందరూ ఇటీవల జరుగుతున్న పరిణామాలకు మౌనంగా ఉండటమే తప్పించి.. ఇది తప్పు.. ఇలా జరగటం ఏమిటి? అన్న మాట ఎందుకు రావటం లేదన్నది ప్రశ్న.

భారతదేశంలో మెజార్టీలుగా ఉన్న హిందువులు.. పాక్.. బంగ్లాదేశ్ లలో మైనార్టీలన్న విషయం తెలిసిందే. దేశంలోని మైనార్టీలకు కించిత్ కష్టం వచ్చినా అదే పనిగా మాట్లాడే లౌకిక వాదులు.. ఓవైపు కశ్మీర్ లో.. మరోవైపు బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువుల్ని చంపేస్తూ.. దారుణంగా దాడులు చేస్తున్న వేళ.. వారి ప్రాణమాన రక్షణ కోసం గళం విప్పరేం? అన్న ప్రశ్నకు సమాధానం లభించదు.

గడిచిన కొద్దిరోజులుగా బంగ్లాదేశ్ లోని హిందువులపై దారుణమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. దైవదూషణలకు పాల్పడ్డారన్న వార్తల నేపథ్యంలో వారం నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగాయి. పీర్ గంజ్ అనే గ్రామంలో హిందువులకు చెందిన 66 ఇళ్లను దుండగులు ధ్వంసం చేయటంతో పాటు ఇరవై ఇళ్లను కాల్చేసిన వైనం చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించి 52 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ హిందువులపై జరుగుతున్న దాడులు మాత్రం తగ్గటం లేదు.
మరోవైపు కశ్మీర్ లో హిందువుల్ని టార్గెట్ చేసుకొని దారుణంగా హత్యలు చేస్తున్నారు. లోకల్.. నాన్ లోకల్ పేరుతోనూ దాడులు చేపడుతున్నారు. ఈ ఉదంతాలపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన బాధ్యత లౌకిక వాదులు.. ప్రజాస్వామ్యవాదుల పేరుతో తరచూ వ్యాసాలు రాసే వారు.. సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వాదనలు వినిపించే వారు.. మైనార్టీలుగా హిందువులు ఉన్న చోట జరుగుతున్న హింస గురించి నోరు విప్పాల్సిన అవసరం ఉంది కదా? మరి.. వారెందుకు మౌనంగా ఉన్నట్లు?




Tags:    

Similar News