'నిమ్మ‌కాయ' ఇస్తే అసెంబ్లీ టికెట్ వ‌చ్చిన‌ట్టే!

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం క‌నిపిస్తోంది.;

Update: 2026-03-24 15:30 GMT

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం క‌నిపిస్తోంది. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌లో టికెట్ కావాల‌నుకునే వారికి ఇంట‌ర్వ్యూలు చేసి.. డీఎంకే అధినేత‌, సీఎం స్టాలిన్ టికెట్ ఇస్త న్నారు. అయితే.. వీరిలో ఎంత‌మందికి టికెట్ ఇస్తార‌న్న‌ది పెద్ద ర‌చ్చ‌గా మారింది. మ‌రోవైపు.. కేర‌ళ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. అక్క‌డ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. గ‌త ఆరు మాసాలుగా బ‌లంగా పోరాటం చేసిన వారి జాబితాను వెలికి తీసి.. వారికి టికెట్ ఇస్తున్నారు.

నిజానికి బ‌లంగా పోరాటం చేయ‌డం వేరు.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉండ‌డం వేర‌ని నాయ‌కులు చెబుతున్నా .. ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు. ఇదిలావుంటే.. 30 స్థానాలు మాత్ర‌మే ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత రాష్ట్రంలో మ‌రి వింత ఆచారం కొన‌సాగుతోంది. ఇక్క‌డి అధికార పార్టీ `ఎన్‌.రంగ‌సామి కాంగ్రెస్`.. నిమ్మ‌కా యతో అభ్య‌ర్థుల అదృష్టాన్ని ప‌రీక్షిస్తున్నారు. తాజాగా ఇక్క‌డ టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం కొనసాగుతోంది. వ‌చ్చే నెల 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీతో జ‌ట్టుక‌ట్టిన రంగ‌సామి.. 30 సీట్ల‌లో 16 తాను తీసుకుని .. 14 బీజేపీకి ఇచ్చారు. అయితే.. త‌నకు ల‌భించిన సీట్ల‌ను పార్టీనాయ‌కుల‌కు కేటాయించే విష‌యంలో సీఎం రంగ‌సామి సెంటి మెంటును ఫాలో అవుతున్నారు. గ‌త మూడు సార్లుగా అధికారంలో ఉన్న రంగ‌సామి..త‌న పార్టీ నాయ‌కుల‌కు నిమ్మ‌కాయ‌ల ద్వారానే టికెట్ కేటాయిస్తున్నారు. చిత్రంగా ఉన్నా ఇది నిజ‌మేన‌ని అంటున్నారు. అంతేకాదు.. తాజా కేటాయింపులు కూడా అలానే చేశారు.

ఏం చేస్తారు?

ప్ర‌స్తుతం 16 స్థానాల‌కు పోటీ చేసేందుకు సుమారు 42 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వీటిలో సీఎం పోటీ చేసే స్థానం ప‌క్క‌న పెడితే.. మిగిలిన 15 మంది అభ్య‌ర్థుల‌ను ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా సీఎం రంగ‌సామి ఎంపిక చేయాలి. అయితే.. ఎంత మంది పోటీలో ఉన్నా.. ఆయ‌న ఎవ‌రినీ త‌ప్పించ‌రు.. నొప్పించ‌రు. ''స‌రే.. కానీ'' అంటారు. ఆ వెంట‌నే పోటీ చేయాల‌ని అనుకునే అభ్య‌ర్థులు.. తమ త‌మ నామినేస‌న్ ప‌త్రాల‌ను పూర్తి చేసి.. రంగసామికి ఇస్తారు.

ఎంత మంది ఇచ్చినా.. ఆయ‌న తీసుకుంటారు. వాటిని తీసుకువెళ్లి.. త‌మ ఇంటి ఇల‌వేల్పు.. `అప్పా పైత్తియ‌స్వామి` ఆల‌యంలో ఒక రాత్రంతా పెడ‌తారు. తెల్ల‌వారు జామున ఆయ‌న ఆల‌యానికి వెళ్లి.. మూల‌మూర్తికి అభిషేకం, పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఈ క్ర‌మంలో త‌న వెంట‌.. 15 నిమ్మ‌కాయ‌లు తీసుకువెళ్తారు. వాటికి కూడా పూజ‌లు చేస్తారు. అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి.. ఆశావ‌హులైన అభ్య‌ర్థులు క్యూ క‌డ‌తారు.

ఈ పూజ చేసిన నిమ్మ‌కాయ‌ల‌ను సీఎం రంగ‌సామి.. ఆశావ‌హుల‌కు ఒక్కొక్క‌టి అందిస్తారు. అంతే.. వారికి పార్టీ టికెట్ ఇచ్చిన‌ట్టే. వారు మాత్ర‌మే బ‌రిలో ఉంటారు. మిగిలిన వారు త‌ప్పుకొంటారు. అయితే.. ఇక్క‌డ డౌట్ రావొచ్చు.. ఆయ‌న కోరుకున్న‌వారికే ఇలా నిమ్మ‌కాయ‌లు ఇస్తారేమో.. అనుకోవ‌చ్చు. కానీ, నిమ్మ‌కాయ‌లు ఇచ్చే స‌మ‌యంలో రంగ‌సామి.. క‌ళ్లూమూసుకుంటారు. అంతేకాదు.. ఆ స‌మ‌యంలో దేవుడిని స్మ‌రిస్తూ.. వ‌ర‌సులో ఉన్న‌వారికే కాదు.. ఎక్క‌డో మూల‌న ఉన్న‌వారికి కూడా ఆయ‌న నిమ్మ‌కాయ‌ను అందిస్తారు. ఇది ఎలా జ‌రుగుతుందో త‌న‌కు కూడా తెలియ‌ద‌ని.. అంతా స్వామి లీల అని అంటారు.

ఇలా.. కొత్త ముఖాలు కూడా నిమ్మ‌కాయ‌లు ద‌క్కించుకుని గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం న‌లుగురు కొత్త‌ముఖాలు(రాజ‌కీయాల‌తో సంబంధం లేనివారు) నిమ్మ‌కాయ‌లు ద‌క్కించుకున్నార‌ట‌. మ‌రి దీనిని సెంటిమెంటు అనాలో.. మూఢ‌న‌మ్మ‌కం అనాలో తెలియ‌దు కానీ.. ప్ర‌జ‌లు.. ఆశావ‌హులు అంగీక‌రించారు!!.

Tags:    

Similar News