జీవన్ రెడ్డి: పట్టుకోలేక.. వదులుకోలేక.. కాంగ్రెస్‌కు తిప్పలు!
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డి వాదనంతా.. తనకు చెప్పకుండా బీఆర్ ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌ను పార్టీలోకి తీసుకున్నారనదే.;
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి తన పట్టు వీడడం లేదు. బెట్టు మానడమూ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. ఇప్పటికి రెండు సార్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం రాయబారాలు చేసింది. నాలుగు రోజుల కిందట మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సహా.. సీనియర్లు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన ససేమిరా అన్నారు.
దీంతో పార్టీ రాష్ట్ర చీఫ్ మహేస్ కుమార్ గౌడ్ సహా.. మరికొందరు నాయకులు మంగళవారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లి.. బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. మర్యాద పూర్వకంగా ఆయన భుజంపై కండువా కప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన కండువాను పక్కకు నెట్టి.. ``ఇక చాలు`` అని వ్యాఖ్యానిం చడంతో మహేష్ కుమార్ గౌడ్ చిన్నబోయారు. అంతేకాదు.. తనకు జరిగిన అవమానాలను జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు.
అధిష్టానం ఇప్పటికే..
పోనీ.. ఈ పరిణామాల క్రమంలో జీవన్ రెడ్డిని వదిలేద్దామంటే.. పార్టీ అధిష్టానం ఇప్పటికే గౌడ్‌కు క్లాస్ ఇచ్చిందన్న వార్తలు వచ్చాయి. జీవన్ రెడ్డికి రాజీవ్ గాంధీ వంటి అగ్రనేతలతో ఉన్న పరిచయాలు.. పార్టీలో ఎంతో మంది వచ్చి ఎంతో మంది పోయినా.. ఆయన మాత్రం నికరంగా ఉన్న తీరు వంటివి పార్టీ అధిష్టానానికి నచ్చాయి. దీంతో ``ఏం చేస్తారో ఏమో.. ఆయన మాత్రం పార్టీని వీడేందుకు వీల్లేదు`` అని రాహుల్ గాంధీ కొన్ని రోజుల కిందట పార్టీ చీఫ్ గౌడ్‌కు తేల్చి చెప్పారు. అందుకే.. వరుస పెట్టి రాయబారాలు చేస్తున్నారు.
ఆఖరి ఘట్టం అదేనా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డి వాదనంతా.. తనకు చెప్పకుండా బీఆర్ ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌ను పార్టీలోకి తీసుకున్నారనదే. అదేసమయంలో తనకు ప్రాధాన్యం తగ్గించారని కూడా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని శాంతింపచేయాలంటే.. ఇక, మిగిలిన ఏకైక అస్త్రం.. ముఖ్యమంత్రేనని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయడమో.. లేక.. పిలిపించుకుని మాట్లాడడమో చేస్తే.. తప్ప.. జీవన్ రెడ్డి శాంతించే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది.
మరి రేవంత్ రెడ్డి దానికి సిద్ధమవుతారా? లేదా? అనేది చూడాలి. కాగా.. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25న జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీ తీర్థం కప్పుకొంటారన్న ప్రచారం ఉంది. మరోవైపు. ఆయన ఇంటి దగ్గర కాంగ్రెస్ జెండాలను కార్యకర్తలు, అనుచరులు తీసేశారు. కాకపోతే.. బీఆర్ ఎస్ జెండాలను ఇంకా కట్టలేదు. మరి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పోరాడుతుందా? లేక వదిలేస్తుందా? అనేది చూడాలి.