రాజ్ ఠాక్రే ఓకే అన్నా కరణ్ కష్టాలు తీరట్లేదే

Update: 2016-10-22 13:56 GMT
టాలీవుడ్ లో సురేశ్ బాబు.. దిల్ రాజు.. అల్లు అరవింద్ లాంటోళ్లు ఎంతటి పవర్ ఫుల్లో.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ దాదాపుగా అలాంటి పవర్ ఫుల్ వ్యక్తి. అతగాడు కానీ ఏదైనా సినిమాను టేకప్ ను చేస్తే.. దాని కతే వేరుగా ఉంటుందని చెబుతారు. అలాంటి కరణ్ జోహార్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎంతటి శక్తివంతుడైనా.. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా.. భావోద్వేగాలు లాంటివి ఏవైనా తెర మీదకు వస్తే ఎంత పవర్ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.

ఉరీ ఉగ్రదాడులు.. అనంతరం భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడుల నేపథ్యంలో భారత.. పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కళాకారులు నటించిన సినిమాల విషయంలో నిషేధం విధించాలన్న చర్చ మొదలు కావటం.. దీనికి కరణ్ తో సహా కొందరు బాలీవుడ్ ప్రముఖులు ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా చాలానే మాటలు చెప్పారు. అలాంటి మాటలతో ఎలాంటి తలనొప్పులు ఎదురవుతాయన్నది కరణ్ జోహార్ తో సహా.. సినీరంగ ప్రముఖులకు ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి.

భారీ బడ్జెట్ తో నిర్మించి.. పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకున్న తన సినిమా షెడ్యూల్  ప్రకారం రిలీజ్ కాకపోతే.. కరణ్ జోహార్ కు పడే దెబ్బ అంతా ఇంతా కాదు. అందుకే.. మొదట్లో కళ.. కళాకారులు అంటూ చాలానే మాటలు చెప్పిన ఆయన.. తర్వాత వాస్తవాన్ని గుర్తించి.. భావోద్వేగాలతో పెట్టుకుంటే పడే దెబ్బ ఆయనకు అర్థమై.. తన గొంతును మార్చేశాడు. అప్పటివరకూ కళకు సరిహద్దులు ఉండవని.. కళాకారుల్ని భారత్.. పాక్ అన్న కోణంలో చూడకూడదన్న ఆయన.. తన సినిమా రిలీజ్ కోసం.. భవిష్యత్తులో ఎప్పుడూ పాక్ కళాకారులకు తన సినిమాల్లో అవకాశం ఇవ్వనని తెగేసి చెప్పే పరిస్థితి. అంతేనా.. తన తాజా చిత్రం.. ‘‘యే దిల్ హై ముష్కిల్’’ రిలీజ్ కు అడ్డు పడిన నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠిక్రేతో రాజీ చేసుకోవటమే కాదు.. సీఎం సాయంతో సినిమాను రిలీజ్ చేసుకునేందుకు ఎన్ని  ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. శుక్రవారం ఉదయం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీన్లోకి వచ్చి.. రాజ్ ఠాక్రేతో పంచాయితీ సెట్ చేసి.. కరణ్ ను సినిమా రిలీజ్ సంగతి చూసుకోవచ్చని హామీ ఇచ్చారు. సీఎం సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఉరీ ఉగ్రఘటనలో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.5కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఓకే అన్నారు.

ఇంత చేస్తున్నా.. కరణ్ కష్టాలు తీరని పరిస్థితి. పెద్ద తలకాయలు ఓకే అన్నా.. సినిమా థియేటర్ల యజమానులు మాత్రం కరణ్ సినిమాకు తమ థియేటర్లను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. పాకిస్థాన్ నటుడు నటించిన సినిమాకు తాము అనుమతి ఇచ్చేదే లేదని తేల్చేశారు. రాజ్ ఠాక్రే లాంటి వాళ్ల అభయం పొందితే సరిపోతుందని ఫీలైన కరణ్ కు తాజా పరిణామం ఊహించని షాక్ గా మారిందని చెప్పక తప్పదు. సినిమా విడుదలకు అడ్డుపడుతున్న అందరిని ఒప్పిస్తున్న కరణ్ కు.. ఇప్పుడు సినిమా థియేటర్ల యజమానులే పెద్ద సమస్యగా మారిన పరిస్థితి. మరి.. ఈ సమస్యను కరణ్ ఏ విధంగా అధిగమిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News