వెబ్‌ సిరీస్‌ పిచ్చి ... 75 మంది ప్రాణాలతో బయటపడ్డారు

Update: 2020-10-31 17:45 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిపోతున్నారు. ముఖ్యంగా వీడియోగేమ్స్ లేదా మొబైల్ గేమ్స్ కు బాగా అలవాటు పడిపోయారు. దీనితో రాత్రి , పగలు అన్న తేడా లేకుండా వాటిల్లో మునిగితేలుతున్నారు. అయితే , ఓ యువకుడి వెబ్‌ సిరీస్‌ పిచ్చి 75 మంది ప్రాణాలను కాపాడింది. వెబ్ సిరీస్ పిచ్చి 75 మంది ప్రాణాలని ఎలా కాపాడింది అని ఆలోచిస్తున్నారా..

అసలు విషయంలోకి వెళ్తే .. ఈ సంఘటన మహారాష్ట్రలోని దొంబివిలి లో గురువారం చోటుచేసుకుంది. దొంబివిలి, కొపర్‌ ఏరియాకు చెందిన కునాల్‌ అక్కడి రెండు అంతస్తుల భవనంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి వెబ్‌ సిరీస్‌ విపరీతమైన పిచ్చి . బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు వెబ్‌ సిరీస్‌ చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో కిచెన్ ‌లోని ఓ భాగం కూలిపోవటం గమనించాడు. ఆ వెంటనే కుటుంబానికి, అదే భవనంలో నివాసం ఉంటున్న మిగితా అందరికి సమాచారం ఇచ్చి , వారందరిని ఆ భవనం నుండి బయటకి తీసుకోని వచ్చేశాడు.

వారు ఆ భవనం నుండి బయటకి వచ్చిన కాసేపటికే రెండు అంతస్తుల భవనం పేక మేడలా కుప్ప కూలిపోయింది. భవనంలోని 75 మంది ప్రాణాలు కాపాడిన కునాల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయాడు. అతడో రియల్‌ హీరో అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే శిథిలావస్థలో ఉన్న ఆ భవంతిని ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలల క్రితమే నోటీసులు ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వారు భవంతిని ఖాళీ చేయడానికి సుముఖత చూపలేదు.
Tags:    

Similar News