జగన్ పేరుతో మోసం చేస్తున్న ముఠా

Update: 2022-07-02 23:30 GMT
జగన్మోహన్ రెడ్డి పేరుతో మోసాలు చేస్తున్న ముఠా వ్యవహారం బయటపడింది. ముఖ్యమంత్రి పీఏ నాగేశ్వరరెడ్డి పేరుతో ఒక ఐడీ తయారుచేసుకుని దాని చూపించటం ద్వారా కొన్నిచోట్ల ఒక ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యానికి టోకరా వేయబోయారు. అయితే చివరి నిముషంలో యాజమాన్యానికి అనుమానం రావటంతో అక్కడి నుండి ఉడాయించారు. అయితే యాజమాన్యం మాత్రం సదరు ముఠాపై పోలీసులకు ఫిర్యాదుచేసింది.

ఈ ముఠా వ్యవహారాలపై అనుమానం వచ్చి పోలీసులు ఆరాతీసినపుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ ముఠా అనేకమందిని మోసం చేసినట్లు తెలిసింది.

బెర్జర్ పెయింట్స్ యాజమాన్యం దగ్గరకు వెళ్ళి మాయమాటలు చెప్పి రు. 10 లక్షలు కొట్టేశారు. జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సు కోసం దావోస్ వెళ్ళిన సమయంలో ఈ మోసం జరిగింది. అలా కొట్టేసిన పది లక్షల రూపాయలను ముఠా సూట్ కేసు కంపెనీకి తరలించింది.

ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎలాంటి అనుమానం రాకపోవటం విచిత్రంగా ఉంది. బెర్జర్ పెయింట్స్ యాజమాన్యం వచ్చి జరిగిన మోసాన్ని చెబితే కానీ పోలీసులకు ఈ విషయం తెలియలేదు. విషయం తెలియగానే సీఎంవో అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని బెర్జర్ పెయింట్స్ వాళ్ళకు చెప్పారు. జగన్ పేరుతో మోసాలు చేయాలనే ఆలోచన రావటం, దాన్ని ముఠా పక్కగా అమల్లో పెట్టడం, పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవటం వ్యవస్ధలో పేరుకుపోయిన జడత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యమంత్రి పేరును ఇంత విచ్చలవిడిగా వాడేసుకుంటు మోసాలు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్ధ ఏమి చేస్తున్నట్లు ? ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ముఖ్యమంత్రికే తలవంపులు తెస్తున్నాయి. కాబట్టి పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిందే.
Tags:    

Similar News