క‌ష్టం వారిది.. ఫ్లెక్సీల ర‌గ‌డ వీరిది.. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌

Update: 2021-01-19 17:30 GMT
క‌ష్టం ఒక‌రిది.. ప్ర‌చారం మ‌రొక‌రిది! అన్న‌ట్టుగా ఉంది క‌రోనా వ్యాక్సిన్ వ్య‌వ‌హారం. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభ మైంది. ఈ నెల 16న భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యం చెప్పుకోవాలి. ఇంత గ్రాండ్‌గా ప్రారంభించిన కార్య‌క్ర‌మంలో వ్యాక్సిన్ క్రెడిట్ మొత్తాన్నీ.. త‌న ఖాతాలో వేసుకునేందుకు మోడీ ప్ర‌య‌త్నించారు. తెలుగు సూక్తులు, సామెత‌లు.. వ‌ల్లెవేసి.. పొరుగువాడికి సాయ‌ప‌డేందుకే వ్యాక్సిన్ తెచ్చాన‌న్నారు.. గ‌తాన్ని.. గిచ్చి.. ఎవ‌రూ చేయంది తాము చేశామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుని తొడ‌లు కొట్టుకున్నారు!

మ‌రి ఈ మ‌ధ్య‌లో అస‌లు వ్యాక్సిన్ తెచ్చేందుకు అహోరాత్రులు శ్ర‌మ ప‌డిన వారు ఏమ‌య్యారు. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ప్ర‌యోగాల కోసం క‌ర్చు చేసిన కంపెనీలు ఏమ‌య్యాయి. అస‌లు వారెవ‌రు.? ఏం చేశారు? ఎన్ని రోజులు క‌ష్ట‌ప‌డ్డారు. మారుతున్న క‌రోనా వైర‌స్ కు అనుగుణంగా.. మార్పులు చేర్పులు ఎలా చేసుకున్నారు?  మేధోమ‌ధ‌నంలో ఎన్ని రోజులు నిద్రాహారాలు మానుకు న్నారు? అనే విష‌యాల‌ను మ‌న ఘ‌న‌త వ‌హించిన‌ ప్ర‌దాని మోడీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. వ్యాక్సిన్ ప్ర‌యోజ‌నాల‌ను, రాజ‌కీయాల‌ను గుండుగుత్తుగా త‌న ఖాతాలో వేసేసుకున్నారు. త‌నే లేక‌పోతే.. అంటూ.. పెద్ద ఎత్తున ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు కూడా పంపేశారు.

ఇక‌, ఆవే చేలో మేస్తే.. దూడ‌లు గ‌ట్టున మేస్తాయా?  ఇప్పుడు బీజేపీ నాయ‌కులు కూడా ఇదే పంథాల్లో పోతున్నారు. ఎక్క‌డ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. అక్క‌డ మోడీ ఫొటోలు, ఫ్లెక్సీల కోసం త‌యారై పోతున్నారు. ఠాఠ్‌! మోడీ బొమ్మ ప‌డాల్సిందే! అంటూ.. ఘీంక‌రిస్తున్నారు. తాజాగా ఈ త‌ర‌హా రాజ‌కీయం తెలంగాణ‌కు కూడా పాకేసింది. ఇక్క‌డ కేసీఆర్ బొమ్మ వేసేస్తున్నారు అధికార పార్టీ నాయ‌కులు. అదేమంటే.. అదంతే! అనేస్తున్నారు. వ్యాక్సిన్ త‌యారీలో కేసీఆర్ పాత్ర ఉందా?  ఆయ‌నేమైనా.. ఒక రాత్రి నిద్ర‌మాని.. వ్యాక్సిన్ కోసం ఆలోచించారా? అంటే.. అదేందిర‌భ‌య్‌! అని ఎదురు గ‌ద్దిస్తున్నారు.

తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  కరోనా వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని ఫొటో లేనందుకు బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముండే సంజీవ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో.. అటు బీజేపీ.. ఇటు టీఆర్ ఎస్ నేత‌ల మ‌ధ్య వివాదం స‌రే.. మ‌రి శాస్త్ర‌వేత్త‌లు ఏమ‌య్యారో.. కంపెనీలు ఏమ‌య్యాయో.. ఆ దేవుడికే తెలియాల‌ని అంటున్నారు మేధావులు.
Tags:    

Similar News