రిటైర్మెంట్ ఏజ్ పెంపు...ఈ గిఫ్ట్ ఎవరి కోసం?

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు ఎవరైనా ఏదో నాటికి పదవీ విరమణ చేయాల్సిందే. మొదట్లో గట్టిగా యాభై ఏళ్ళు వస్తే చాలు రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించేసేవారు.;

Update: 2026-01-01 17:06 GMT

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు ఎవరైనా ఏదో నాటికి పదవీ విరమణ చేయాల్సిందే. మొదట్లో గట్టిగా యాభై ఏళ్ళు వస్తే చాలు రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించేసేవారు. పాతకాలం వారు అంతా అలాగే పనిచేశారు. అలాంటిది కాల గమనంలో ఆ రిటైర్మెంట్ ఏజ్ ని పెంచుకుంటూ పోతున్నారు. దానికి పెరుగుతున్న జీవిత కాలం కూడా ఒక కారణంగా ఉంది. అలా 55 ఏళ్ళకు రిటైర్మెంట్ అంటూ 1978 దాకా ఉండేది. అయితే మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా దానిని 58 చేశారు 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక దాన్ని 55 కి చేస్తే నాదేండ్ల భాస్కరరావు 58 గా ఉంచి ఉద్యోగులకు మేలు చేశారు.

విభజన తరువాత :

ఇక చూస్తే విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా వేరు పడ్డాయి. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పుట్టుకుని వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పదవీ విరమణ వయసును 60కి చేయమని ఉద్యోగులు కోరుతూ వచ్చారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం 60 ఏళ్ళకు పెంచితే వైఎస్ జగన్ 62 ఏళ్ళకు పెంచారు. ఇక తెలంగాణాలో చూస్తే కేసీఆర్ ప్రభుత్వం 61 ఏళ్ళకు పదవీ విరమణ వయసు పెంచితే ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని మరో మూడేళ్ళు పెంపు చేస్తూ 64 ఏళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ గా నిర్ధారించాలని చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి.

వ్యూహాత్మకంగానే :

పదవీ విరమణ వయసుని పెంచడం ద్వారా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ని కొంతకాలం వాయిదా వేసుకోవచ్చు అన్నది ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. తక్షణం రిటైర్మెంట్ ఉంటే పెద్ద ఎత్తున వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఖజాన కూడా సపోర్టు చేయదని అంటున్నారు. దాంతో పాటుగా ఉద్యోగ సంఘాలలో కొందరు పదవీ విరమణ వయసు పెంచాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు అలా వారి కోరికకు పెద్ద పీట వేస్తూ నెరవేర్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. ఇలా రెండిందాలుగా లబ్ది పొందవచ్చు అన్నది ప్రభుత్వం వ్యూహంగానూ ఉంది అని చెబుతున్నారు.

వారి ఆగ్రహం :

అయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని ఒక్కసారిగా మూడేళ్ళు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత ఊరట లభిస్తుంది కానీ అదే సమయంలో తెలంగాణాలో ఉన్న నిరుద్యోగుల విషయంలో మాత్రం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణా అన్నది ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలు అన్న దాని మీద. గడచిన పన్నెండేళ్లుగా ఎలాంటి నియామకాలు పెద్దగా లేవని అంటున్నారు. దాంతో విద్యార్ధులు కానీ నిరుద్యోగులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఉద్యోగాలు తమకు తీయకుండా ప్రభుత్వంలో ఉన్న వారికే మరిన్నేళ్ళు చాన్స్ ఇస్తూ వారి పదవీ విరమణ ఏజ్ ని పెంచితే కనుక యూత్ నుంచి నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. దాంతో ప్రభుత్వం ఈ ఆలోచన విషయంలో మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ ఖజానా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రిటైర్మెంట్ ఏజ్ పెంచేందుకే మొగ్గు చూపిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ముహూర్తం అపుడే :

ఇక ఈ ఏడాది జూన్ 2న తెలంగాణా అవతరణ దినోత్సవం జరుగుతుంది. ఆ రోజు నుంచి పదవీ విరమణ ఏజ్ పెంచిన దానిని అమలు చేయాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అధికారికంగా తొందరలోనే దీనికి సంబంధించి ప్రకటన వస్తుందని చెబుతున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో. ఒక వేళ తెలంగాణా సర్కార్ కనుక ఈ పెంపుని అమలు చేస్తే ఏపీలోనూ దాని ప్రభావం తప్పకుండా పడుతుందని అంటున్నారు.

Tags:    

Similar News