ఆ పార్టీ బ్లెస్సింగ్స్ : రెండవసారి జగన్ సీఎం...?

Update: 2022-06-24 00:30 GMT
ఆరు నూరు అయినా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు. ఇది ఢిల్లీలోని బీజేపీ పెద్దల గట్టి శపధం. దానికి తగినట్లుగానే అక్కడ నుంచే జోరుగా  పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఒక విషయం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో బాబు నీడను కూడా టచ్ చేయడానికి కాషాయం పెద్దలు ఇష్టపడడం లేదని అర్ధమవుతోంది. బాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే  ఎం వెంకయ్యనాయుడును రాష్ట్రపతి పదవిలోకి తీసుకురానీయకుండా ఆపారని ప్రచారంలో ఉంది.

మరి దాన్ని బట్టి చూస్తే బాబు రాజకీయ జీవితానికి కొనసాగింపు చేయకుండా ఎంతదాకా వెళ్ళాలో అంతదాకా వెళ్ళేందుకు బీజేపీ నేతలు సిద్ధపడతారని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో వారికి ప్రత్యేక ప్రీమాభిమానాలు లేకపోయినా బాబుతో కాంగ్రెస్ తో ఆయనకు ఉన్న బద్ధ వైరమే బీజేపీతో  స్నేహం కలిపేలా చేస్తోంది. ఇప్పటికి అయితే జగన్ ఏపీలో ఉంటేనే మనకు అన్ని విధాలుగా  బెటర్ బెస్ట్ అని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అంటే ఒక విధంగా అది వైసీపీకి కోరని వరంగానే చూడాలి అని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు ఏపీలో హోరా హోరీగా సాగడం తధ్యం ఈ విషయంలో ఎంతదాకా అయినా టీడీపీ వైసీపీ వెళ్తాయి. ఈ సమయంలో ఆర్ధికపరంగా కూడా ఎవరు ముందంజలో ఉంటే వారి వైపే ఎడ్జ్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విషయంలో వైసీపీ తగిన జాగ్రత్తలతోనే ఉంది అని చెబుతున్నారు. ఇక కేంద్రం కూడా తగిన విధంగా సహకారం ఎన్నికల సమయాన వైసీపీకి అందించే వీలు ఉంది అంటున్నారు.

అదే టైమ్ లో టీడీపీ ఆర్ధిక మూలాలను మూడేళ్ళలో జగన్ వీలైనంతగా దెబ్బ తీశారు. దాని దెబ్బకు నేతలు అంతా మూలకు వెళ్ళిపోయారు. ఇపుడిపుడే వారు బయటకు వస్తున్నారు. అయితే  ఈడీ దాడులు కొందరి మీద జరుగుతాయన్న ప్రచారం కూడా ఇపుడు జోరుగా సాగడంతో నేతలలో మళ్లీ టెన్షన్ పట్టుకుంది. అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ మీద ఈడీ దాడులు జరిగాయి. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో మరి కొందరు నేతల మీద కూడా గురి ఉంది అంటున్నారు.

ఇలా కూశాలు కదిలించే మాస్టర్ ప్లాన్ కూడా రానున్న రోజులలో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కు. ఆయనకు ఈ ఎన్నికలే వరం, బలం. ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి బాబుని మూలన కూర్చోబెడితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఉండదు అన్న ఆలోచనలు అటు వైసీపీలో ఇటు బీజేపీలో కూడా ఉన్నాయని అంటున్నారు.

దాంతో సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి మరీ టీడీపీ మీద భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తారు అంటున్నారు. ఇక ఏపీలో జనసేన టీడీపీ కలిసేందుకు చివరి నిముషం వరకూ బీజేపీ పడనీయకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ కలిసినా ఆ పొత్తు ఫలవంతం కాకుండా చూసే మార్గాలను కూడా అన్వేషిస్తారు అని అంటున్నారు. మొత్తానికి ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా విపక్షాలు ఏకమైనా కూడా బీజేపీ కేంద్ర పెద్దల బ్లెస్సింగ్స్ వైసీపీకి ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో ఏదో ఒక విధంగా రెండవసారి జగన్ సీఎం అవుతారు అన్న ధీమా అయితే పార్టీలో ఇపుడు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News