తెలంగాణ విషయంలో తమిళనాడు అలా చేస్తుందా?

Update: 2021-05-06 04:30 GMT
గతంలో మాదిరి చాలా విషయాలు బయటకు రావటం లేదు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఏదైనా జరిగితే.. వెంటనే విషయాలు బయటకు పొక్కేవి. అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉండే అధికారులు ఒక స్థాయికి మించి జరిగే దారుణాల గురించి ఇప్పటి మాదిరి కళ్లప్పగించి చూడకుండా.. తప్పుల్ని ఎత్తి చూపేందుకు ఇష్టపడేవారు. ఇప్పటి మాదిరి ఎస్ బాస్ అనే అధికారులు ఇంత భారీగా ఉండేవారు కాదు. దీంతో.. ప్రభుత్వం అదిమి పెట్టినప్పటికి.. విషయాలు బయటకు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ సమాచారాన్ని ఆపేయటం.. ఐరన్ కర్టెన్ ను క్రియేట్ చేసి.. ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వట్లేదు.

ఒకవేళ.. ఎక్కడైనా విషయాలు లీక్ అవుతుంటే.. తమకున్న శక్తిసామర్థ్యాలన్నింటిని వినియోగించి.. అవసరమైతే నిఘా విభాగాన్ని దింపి.. అందుకు కారణమైనోళ్లు ఎవరన్నది తెలుసుకోవటం.. ఆ వెంటనే వారిని అ ప్రాధాన్యత శాఖలకు మార్చటం ఎక్కువైంది. ఇలాంటి ధోరణి తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా ఎక్కువైందనే చెప్పాలి. ఇప్పుడు అది కాస్తా మరింత ముదిరి.. రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతున్నా.. బయటకు పొక్కనివ్వకుండా ఉండేలా చేస్తున్న వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ తరచూ ప్రశ్నల్ని సంధిస్తూ.. జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాన్ని అడుగుతున్న వైనంతో కొన్ని విషయాలైనా బయటకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణకు పొరుగన ఉండే తమిళనాడు రాష్ట్రం ఆడుతున్న తొండాట గురించి హైకోర్టులో వెల్లడించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక అధికారి ఒకరు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు.. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు.

కరోనా కేసుల నమోదు మీద జరిగిన విచారణ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకుంటున్నట్లు చెబుతూ.. తమిళనాడులోని పెరంబదూరు నుంచి ఆక్సిజన్ రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కోర్టు తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్రు ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

అంతేకాదు.. ఈ అంశంపై చర్యలు తీసుకొని కోర్టు చెప్పాలన్న సూచన చేసింది. కీలకమైన ఆక్సిజన్ పంపిణీ విషయంలో పొరుగు రాష్ట్రం చేస్తున్న తొండాట గురించి హైకోర్టు విచారణలో బయటపడిన తీరు చూస్తే.. ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. ఒకవేళ.. కోర్టు కానీ ఆ దిశగా గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగకుంటే.. ఈ విషయాన్ని శ్రీనివాసరావు చెప్పే వారే కాదు. నిజానికి తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే శ్రీనివాసరావుకు ముఖ్యమైనప్పుడు.. తమిళనాడు తీరుకు బ్రేకులు వేసేలా చేయాలి కదా? అలాంటిదేమీ లేకపోవటం చూస్తే.. సమాచారం ఏదైనా సరే.. బయటకు రానివ్వకుండా అడ్డుకోవటం ఎంతలా పెరిగిందనటానికి తాజా ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News