ప్ర‌తిప‌క్షానికి ఇప్పుడు ఐడియా త‌ట్టింది

Update: 2016-06-22 16:17 GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో క‌క‌లావిక‌లం అయిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇపుడు మెల్లిగా తేరుకుంటోంది. తెలంగాణ ఇచ్చిన త‌మ పార్టీని జంపింగ్‌ ల‌తో చావుదెబ్బ కొట్టిన టీఆర్ ఎస్ పార్టీని రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌లేక‌పోయినా నైతికంగా ప‌లుచ‌న చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వీడిన వారి ఇలాకాల్లో నిర‌స‌న‌ల‌కు చేపట్టేందుకు సిద్ధ‌మైంది.

ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి మొదలు  తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కారెక్కేరు. ఇక ఎమ్మెల్సీలు - పలువురు నేతలు చాలామందే టీఆర్‌ ఎస్‌ గూటికి చేరిపోయారు. కొందరు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే, మరికొందరు సొంత పార్టీలోని అంతర్గత పోరు కారణంగా పార్టీని వీడారు. తాజాగా ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి - ఎమ్మెల్యే భాస్కర్‌ రావు - వివేక్‌ బ్రదర్స్‌ మూకుమ్మడిగా పార్టీ మారడంతో.. కాంగ్రెస్‌ హైకమండ్‌ జంప్‌ జిలానీలకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదన్న నిర్ణయంతో..పీసీసీకి కార్యచరణను ఇచ్చింది. పార్టీకి చేయిచ్చిన నేతల నియోజకవర్గాల్లో.. ప్ర‌తికారం తీసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. ఇందులో భాగంగా సభలు - ర్యాలీలు - సమావేశాలతో పార్టీ మారిన బండారం బయటపెట్టడంతో పాటు.. జంప్‌ జిలానీల ఇళ్ల ముందు నిరసనలు - ధర్నాలు చేసి వారి రాజీనామాకు డిమాండ్‌ చేయాలని అధిష్టానం భావిస్తోంది.

ఈ నిర‌స‌న ప‌ర్వంలో భాగంగా మిర్యాలగూడలో తొలి సభను ఏర్పాటు చేయాలని, ఆ సభలో ఇటీవల పార్టీ మారిన భాస్కర్‌ రావు పార్టీకి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. అయితే ఇదేదో మొదట్లోనే చేసి ఉంటే పార్టీకి ఇంత డ్యామేజ్‌ జరిగి ఉండేది కాదని, మొత్తానికి ఆలస్యంగానైనా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది.
Tags:    

Similar News