సమ్మే వేళ..ఖమ్మం డ్రైవర్ లానే హైదరాబాద్ కండక్టర్ బలిదానం

Update: 2019-10-14 06:51 GMT
తెలంగాణ ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో మొదలైన సమ్మె అంతకంతకూ వేదన రూపం సంతరించుకుంటోంది. కలలో కూడా ఊహించనిరీతిలో ఒక డ్రైవర్.. మరో కండక్టర్ ప్రాణ త్యాగం చేసిన తీరు ఆవేదనాభరితం కావటమే కాదు.. ఆర్టీసీ సమ్మె మరింత ఉద్రిక్తమయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.  

ఖమ్మానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ తనను తాను కాల్చుకొని తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వేళలో ప్రాణాలు విడిచారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన ఆర్మీసీ కార్మికులకు మరో విషాదాన్ని మిగిల్చే ఘటన ఆదివారం రాత్రి వేళలో చోటు చేసుకుంది. రాణిగంజ్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న సురేందర్ గౌడ్.. సమ్మె విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వేదనతో.. ఇంట్లో ఎవరూ లేని వేళ ఉరి వేసుకొని మరణించిన వైనం షాకింగ్ గా మారింది.

ఏడాది క్రితం కూతురు పెళ్లి కోసం బ్యాంకులో అప్పుతీసుకున్న అతను.. ఈ నెలలో చేసిన పనికి చెల్లించాల్సిన జీతాల్ని సమ్మె చేస్తున్నారన్న కారణంగా చెల్లించకపోవటంతో ఈఎంఐ బౌన్స్ అయ్యింది. దీంతో.. తీవ్ర వేదనకు గురైన అతను ఎవరూ లేని వేళ.. ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్నిచోట్ల ఆత్మహత్యయత్నాలు ఒకట్రెండు చోటు చేసుకున్నాయి. దీంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటమే కాదు.. ఉద్యోగుల ప్రాణాలు పోయే వరకూ విషయాన్ని ప్రభుత్వం లాగుతుందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల పర్వమే.. నాటి కేంద్రాన్ని కదిలించిందని చెప్పాలి. మరి.. తాజాగా చోటుచేసుకుంటున్న బలవన్మరణాలు ఆగిపోయేలా సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారు? అన్నది క్వశ్చన్ గా మారిందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News