చీప్ లిక్కర్ ఇష్యూలో వెనక్కి తగ్గింది అందుకేనా?

Update: 2015-09-02 18:06 GMT
ఆరునూరైనా.. నూరు నూటపదహారైనా చీప్ లిక్కర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రంకెలేసిన మంత్రివర్యులు పక్కన పెట్టుకొని మరీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటను చెప్పేశారు. చీప్ లిక్కర్ విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని చెప్పుకొచ్చారు. చీప్ లిక్కర్ మీద వెనక్కి తగ్గేది లేదని చెప్పి వారం కాకముందే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు భిన్నమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనా? విపక్షాలు విరుచుకుపడతాయనా? లాంటి ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే.. రాజకీయ వర్గాల వాదన ప్రకారం.. చీప్ లిక్కర్ వెనుక తగ్గటంపై అసలు విషయం వేరే ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఒకటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఫ్లెక్సిబుల్ మనిషి. ఆయన ఏ నిర్ణయాన్ని అయినా తీసుకోగలరు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకున్నా.. విపక్షాలు మండిపడతాయని తలచినా.. ఆయన కానీ మనసులో ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు.

అలాంటి కేసీఆర్.. చీప్ లిక్కర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గటంపై అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చీప్ లిక్కర్ కారణంగా గౌడ కులస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్న అంచనా ఆయన్ను వెనకడుగు వేసేలా చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం విపక్షాలకు ఇవ్వటంతోపాటు.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సందేహాలు వ్యక్తమయ్యేలా తాజా నిర్ణయం ఉంటుందని చెప్పొచ్చు.

తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది కావటం.. విద్యాధికులు.. మేధావి వర్గం కానీ కేసీఆర్ మీద కత్తి కడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఉద్యమ నేతగా కేసీఆర్ కు ప్రత్యేకంగా ఎవరో వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి కారణాల వల్లే చీప్ లిక్కర్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లుగానే భావించాలి.
Tags:    

Similar News