పవన్ దొంగ అని ఇప్పుడు తెలిసిందా మీకు?

Update: 2018-07-11 04:48 GMT
కొద్ది నెలల కిందటి వరకు చంద్రబాబును మెప్పించడం కోసం టీడీపీ నేతలు జగన్ ను తిట్టేవారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు మెప్పు కోసం పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ను విమర్శించడంలో పోటీలు పడుతున్నారు. ఆ క్రమంలో ఇంతకాలం తాము అదే పవన్‌తో అంటకాగామన్న సంగతి మర్చిపోతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన మైనారిటీ నేత.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా పవన్ పై మండిపడ్డారు. పవన్ తో పాటు జగన్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పైనా ఆయన విమర్శలు గుప్పించారు.
    
పవన్ - జగన్ - కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్ ఓ దొంగ అంటూ ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ‘పీఆర్పీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర మీది కాదా?’ అని నిలదీశారు. ప్రధాని మోదీ ముగ్గురు దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రానికి సైతాన్‌ లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకొనేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.
    
అయితే.. వీరిలో ముగ్గురితోనూ జలీల్ ఖాన్ గతంలో పనిచేసినట్లు చెప్పుకోవాలి. ఆయన ఎన్నికైందే వైసీపీ నుంచి కాబట్టి... ఆయన అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి వైసీపీ వల్ల దక్కిందే కాబట్టి జగన్ ను ఆయన విమర్శించడం హాస్యాస్పదమనే చెప్పాలి. ఇక పవన్ - బీజేపీల విషయానికొస్తే.. జలీల్ ఖాన్ టీడీపీలోకి వచ్చిన తరువాత పార్టీ పరంగా బీజేపీ - పవన్ లతో కలిసి పనిచేసినట్లే. ఆ తరువాత దారులు వేరవడంతో వారు ఇప్పుడు టీడీపీకి శత్రువులయ్యారు. దీంతో ఇంతకాలం టీడీపీ పవన్ తో కలిసి ఉన్నంత కాలం ఆయన దొంగ అన్న సంగతి జలీల్ కు తెలియదా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
Tags:    

Similar News