బాబుకు దిమ్మ తిరిగే షాక్:ఐదింటిలో 4 ఓటమి

Update: 2017-03-22 04:39 GMT
ఏపీలో జరిగిన ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. స్థానికసంస్థలకు జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రలోభాలకు గురి చేసి.. అధికార ‘ఒత్తిడి’తో మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిని తమ ఖాతాలోకి వేసేసుకున్న టీడీపీ.. జబ్బులు చరుచుకుంది.

తమ బలం ఎంతో చూశారా? అంటూ బాబు బ్యాచ్ విర్రవీగింది. వారి హడావుడి మాటలు సాగుతున్న వేళలోనే..మిగిలిన ఐదు ఎమ్మెల్సీ (పట్టభద్రుల.. టీచర్ల) స్థానాలకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో అధికార టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దారుణ ఓటమికి గురి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. స్థానిక సంస్థలకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో ప్రజాప్రతినిదుల చేత క్రాస్ చేయించుకొని.. బలం లేకున్నా గెలిచిన టీడీపీ.. ప్రత్యక్షఎన్నికలైన ఉపాధ్యాయ..గ్రాడ్యుయేట్స్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీ ఓటమికి గురి కావటం గమనార్హం.

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏ రీతిలో అయితే.. సర్వశక్తులు ఒడ్డి గెలుపు సాధించాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించినా.. ఓటర్లు మాత్రం అందుకు సహకరించలేదు. బాబు బలపర్చిన అభ్యర్థులపై తమకున్న ఆగ్రహాన్ని ఓట్లతో చెప్పేశారు. దీంతో.. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిలో అధికార తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోవటం గమనార్హం. సీమలో టీడీపీకి గట్టి షాకిచ్చిన ఓటర్లు.. ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ మిత్రుడైన బీజేపీ అభ్యర్థి విజయంతో అంతో ఇంతో పరువు దక్కించుకున్న పరిస్థితి.

తాజాగా జరిగిన ఐదు ఉపాధ్యాయ.. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు ఎందుకంత ప్రాధాన్యత అంటే.. ఏపీలోని మొత్తం 13 జిల్లాలకు నాలుగు జిల్లాలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ ఎన్నికలు జరిగాయి. వీటిల్లో ఒక్కటిమినహా మిగిలిన నాలుగింటిలోనూ అధికార టీడీపీ ఓడిపోవటం చూస్తే.. ప్రజాక్షేత్రంలో బాబు పాలనపై ఎంత గుస్సా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News