తెదేపా వారికి ఆరాధ్యదైవం జగన్!

Update: 2017-08-12 00:30 GMT
ఏపీలోని తెలుగుదేశం నాయకులు అందరికీ ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరాధ్య దైవం అయిపోయాడు. ఆడబోయిన తీర్థం ఎదురైందన్న సామెత చందంగా.. తమకు దేవుడిచ్చిన వరం లాగా జగన్మోహనరెడ్డి వారికి కనిపిస్తున్నారు. అవును మరి.. ఏపీలోని యావత్ తెలుగుదేశంలోని ప్రతి నాయకుడూ.. పార్టీలో తమ ఇమేజి పెంచుకోవాలంటే.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే.. వైఎస్ జగన్మోహన రెడ్డిని తిట్టడం ఒక్కటే ఎజెండా కార్యక్రమంగా వ్యవహరిస్తున్నారు. జగన్ ను తూలనాడితే చాలు.. ఇంకాస్త రెచ్చిపోయి జగన్ దిష్టిబొమ్మను దహనం చేస్తే చాలు.. పార్టీలో తమ క్రేజ్, గుర్తింపు అమాంతం పెరిగిపోతుందని తెదేపా నాయకులు ఆరాటపడుతున్నారని అంతా అనుకుంటున్నారు.

వైఎస్ జగన్ మోహనరెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచార పర్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి నిశితమైన విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించకుండా మరో రకంగా వ్యవహరిస్తారని అనుకోవడం భ్రమ. అయితే.. చంద్రబాబునాయుడు గురించి జగన్ చేసిన కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు తప్ప.. ఆయన చేసిన అసలు సిసలు విమర్శలేమీ తెలుగుదేశం వారికి పనికి రాకుండా పోయాయి. జగన్ ఆవేశంలో అన్న మాటలనే పట్టుకుని ఆయనను ఎన్ని రకాలుగా బద్నాం చేయవచ్చు అనేదానిపై ఎవరికి వారు తమ తమ క్రియేటివిటీకి పదును పెట్టి.. పార్టీలో గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు.

మంత్రుల స్థాయిలో అయితే.. జగన్మోహన రెడ్డిని తూలనాడని వారు లేరు. ముఖ్యమంత్రి అయితే మరీచోద్యం.. జగన్ తిట్లను పురస్కరించుకుని.. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అందరినీ కలగలిపి ఆయన తిట్టేశారు. మంత్రులతో ప్రారంభించి గల్లీ లీడర్ల వరకు ఎవరికి తోచిన స్థాయిలో వారు.. జగన్ ను ఆడిపోసుకోవడం రాష్ట్రమంతా బిజీగా కనిపిస్తున్నారని జనం అనుకుంటున్నారు.

ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే వారు కొందరు - జగన్ మీద వాదోపవాదాలు పెట్టుకుంటున్న వారు కొందరు, ఈసీకి ఫిర్యాదు చేసేవాళ్లు - పోలీసులకు ఫిర్యాదు చేసేవాళ్లు ఇలా రకరకాలుగా.. ఎవరికి వారు తాము పార్టీకోసం జగన్ సంగతి తేలుస్తాం అన్నట్లుగా బిల్డప్ లు ఇచ్చి తమ స్థానం సుస్థిరం చేసుకోవడానికి తపన పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News