మెరుగులు అద్దుతోన్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ మాటేంటి...?

అధికార పార్టీ టీడీపీకి మెరుగులు అద్దే ప‌నిలో పార్టీ అధినేత చంద్ర‌బాబు తీరిక లేకుండా ఉన్నారు.;

Update: 2025-12-12 06:38 GMT

అధికార పార్టీ టీడీపీకి మెరుగులు అద్దే ప‌నిలో పార్టీ అధినేత చంద్ర‌బాబు తీరిక లేకుండా ఉన్నారు. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న స‌మ‌యం ఇస్తున్నారు. తాను ఎక్క‌డున్నా.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా.. పార్టీలో ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఆయ‌న తెలుసు కుంటున్నారు. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. త‌ద్వారా.. పార్టీకి న‌గిషీలు అద్దే ప‌నిలో ఉన్నారు.

వాస్త‌వానికి అధికారంలో ఉన్నప్పుడు స‌హ‌జంగానే పార్టీలపై దృష్టి పెట్టేందుకు.. నాయ‌కుల‌కు స‌మ‌యం ఉండ‌దు. అంతా బాగుంద‌న్న వాద‌న‌లోనే ఉంటారు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇదేభావ‌న‌తో ఉన్నారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఆయ‌న మారుతున్నారు. ఇటీవ‌ల కాలంలో పార్టీకి స‌మ‌యం ఇస్తున్నారు. పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్నారు? వారికి ఇస్తున్న టాస్కుల‌ను పూర్తి చేస్తున్నారా? లేదా? అనే విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్నారు.

త‌ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేస్తున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. అయినా.. కూడా చంద్ర‌బాబు త‌న పంథాను మార్చుకుని పార్టీకి స‌మ‌యం ఇస్తుండ‌డం వెనుక భారీ ల‌క్ష్యాన్ని ఆయ‌న నిర్దేశించుకున్నారు. వైసీపీకి ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వ‌కుండా పార్టీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఉమ్మ‌డి క‌ల‌యిక‌ను ఆయ‌న కోరుకుంటున్నారు. దీనికి ప్రాధాన్యం ఇస్తున్న క్ర‌మంలో తానే ముందుగా జోక్యం చేసుకుని వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇది రాజ‌కీయాల్లో ముఖ్యంగా ఏపీ వంటి బ‌ల‌మైన ఈక్వేష‌న్లు.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఉన్న రాష్ట్రంలో ముందు నుంచి పార్టీని సంస్క‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఈ కోణంలో చూసుకుంటే.. వైసీపీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. ఇప్ప‌టి కిప్పుడు పార్టీలో సంస్క‌ర‌ణలు తీసుకువ‌స్తారా? లేక ఇంకా వేచి చూస్తారా? అనేది తేలాల్సి ఉంది. ప్ర‌త్య‌ర్థులు ప‌దును పెంచుతున్న నేప‌థ్యంలో వైసీపీ ఇప్ప‌టికే తేరుకుని ఉండాలి. మ‌రి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News