ట్యాపింగ్.. ప్రభాకర్ రావు లొంగుబాటు.. ఏం చెబుతారో?
రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.;
రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్లుగా చెబుతున్న ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు. ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు సిట్ ఆఫీసర్, ఏసీపీ వెంకటగిరి (జూబ్లీహిల్స్ స్టేషన్) ఎదుట లొంగిపోవాలని సూచించింది. విచారణ క్రమంలో ప్రభాకర్ రావుకు భౌతికంగా హాని తలపెట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ స్టేషన్ లో సిట్ ఎదుట హాజరయ్యారు. ఆయనను వారం పాటు కస్టోడియల్ విచారణకు సుప్రీం అనుమతించింది.
వచ్చే వారం కీలకం..
సిట్ విచారణ తర్వాత వచ్చే నివేదికపై మళ్లీ విచారణ చేస్తామని చెప్పిన సుప్రీం కోర్టు కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే వారం కీలకం కానుంది. కాగా, ప్రభాకర్ రావు ఇప్పటికే ఆరుసార్లు సిట్ ఎదుట హాజరైనట్లు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఆయన న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతర ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను పెండింగ్ లో పెట్టారు. ఈ ఏడాది మే 29న ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను సవరిస్తూ, ఆయనను కస్టోడియల్ విచారణకు అనుమతించారు.
ఏం చెబుతారో..??
వారం పాటు విచారణలో ప్రభాకర్ రావు ఏం చెబుతారన్నది కీలకం కానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకు భారీ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు దీనిని ప్రస్తావించారు. ఈ అంశాన్ని ఆయన చాలా సీరియస్ గానూ పరిగణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాకర్ రావు వారం రోజుల విచారణలో ఏం చెబుతారు? అనంతరం వచ్చే నివేదికపై సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? అది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది ?అనేది వేచి చూడాలి.