మీ రేషన్ కార్డు వెనక్కి... బిగ్ అలెర్ట్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకుని వచ్చింది.;

Update: 2025-12-12 07:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకుని వచ్చింది. ఈ రేషన్ కార్డుల మీద ఏ ప్రభుత్వం ముద్ర ఉండకుండా ఎవరి ఫోటో లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అంతే కాదు ఈ రేషన్ కార్డుని స్మార్ట్ గా డిజైన్ చేసి దేశంలో ఎక్కడ ఉన్నా సరైన సమయానికి రేషన్ ఏ దుకాణం నుంచి అయినా తీసుకునే వీలు కల్పించారు. ఇలా అందంగా తయారు చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్ట్ 25 నుంచి ప్రారంభించారు. ప్రతీ ఇంటికీ వెళ్ళి రేషన్ కార్డులు ఉచితంగా అందచేశారు. ఆ తరువాత సచివాలయాల వద్ద రేషన్ దుకాణాల వద్ద కూడా ఉంచి మరీ ఫ్రీగా ఇచ్చారు.

మూలుగుతున్నాయి :

అయితే ఇంత చేసినా చాలా కార్డులు అయితే ఇంకా మూలుగుతున్నాయి. వాటిని తీసుకోవడానికి ఎవరూ లేకపోవడం విశేషం. దాంతో ఈ మిగిలిన రేషన్ కార్డులను ఏమి చేయాలన్న దాని మీద కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఒక డెడ్ లైన్ కూడా పెట్టేసింది లబ్ధిదారులు తమ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వారు లబ్దిదారులుగా నమోదు అయిన రేషన్ దుకాణాల నుండి పొందడానికి చివరి తేదీగా ఈ నెల 15 ని డెడ్ లైన్ పెట్టేసింది.

ఈసారి ఫ్రీ కాదు :

ఒక వేళ ఈ గడువులోగా ఎవరైనా తమ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోకపోతే, దానిని తహసీల్దార్ కార్యాలయానికి లేదా పౌర సరఫరాల కమిషనరేట్‌కు తిరిగి పంపుతారు. అయితే ప్రచారంలో ఉన్నట్లుగా రేషన్ కార్డు అయితే అసలు రద్దు చేయబడదు కానీ ఈసారి కార్డు కావాలీ అంటే ఫ్రీగా మాత్రం ఇవ్వరు. ఈ రేషన్ కార్డుని తీసుకోవడానికి లబ్ధిదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వారు దరఖాస్తు చేసుకుంటే కనుక కొరియర్ డెలివరీ లేదా కొత్త దరఖాస్తు ప్రక్రియ ద్వారా దానిని స్వీకరించడానికి నామమాత్రపు రుసుము గా 35 నుంచి 50 రూపాయలుగా విధించారు అంతే కాదు జరిమానాగా వారు సుమారు 200 రూపాయలు దాకా చెల్లించాల్సి రావచ్చు అని అంటున్నారు.

కోట్లలో పంపిణీ :

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 25 నుంచి ఇప్పటిదాకా దశలవారీగా ఏపీలో ఏకంగా 1.46 కోట్ల స్మార్ట్ కార్డుల ఉచితంగా పంపిణీ చేసింది. అంతే కాదు ఇంటింటికీ కూడా వెళ్ళి మరీ ఇచ్చింది. ఇక రేషన్ దుకాణాలలో పంపిణీని కూడా సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించింది. అలా చాలా మంది కార్డులను ఇప్పటికే పొందారు. కానీ పొందని వారు కార్డు తీసుకోని వారు ఏపీ వ్యాప్తంగా చూస్తే ప్రతీ జిల్లాలో వేలల్లో ఉన్నారు అని లెక్కలు అయితే చెబుతున్నారు అలా రేషన్ కార్డులు పేరుకుని పోయాయని అంటున్నారు.

సవరణలకు సైతం అనుమతి :

ఇక చాలా మంది లబ్ధిదారులు తమ బియ్యం కార్డు వివరాలలో సవరణల కోసం కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వారు గ్రామ వార్డు సచివాలయాలలో సవరణలు చేసుకోవడానికి ఈ ఏడాది అక్టోబర్ 31 దాకా టైం ఇచ్చారు. అలా వారంతా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంతే కాదు ప్రతీ రేషన్ కార్డు ఈకేవైసీ ద్వారా ఆధార్ అనుసంధానం అనేది కూడా చేస్తూ వచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా కార్డుల జారీలో పారదర్శకతను నిర్ధారించడానికి లేదా దుర్వినియోగాన్ని నిరోధించడానికి నిర్వహిస్తున్న ఒక కీలకమైన, ప్రక్రియగా అధికారులు చెప్పుకొచ్చారు. ఇక ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేయలేదో వారి కార్డులు కూడా తాత్కాలికంగా నిలుపు చేశారు.

అది నిరంతర ప్రక్రియ :

ఇదిలా ఉంటే కొత్తగా రేషన్ కార్డులు కానీ పేరు చేర్చడం లేదా తొలగించడం, చిరునామా మార్పు మొదలైన సేవల కోసం దరఖాస్తులను గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో నిరంతరం స్వీకరిస్తారని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు రేషన్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా నిరంతరం పరిష్కరించే విధంగా ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News