అచ్చం ‘‘స్నేక్ గ్యాంగ్’’ లాంటి ‘‘తాడేపల్లి ముఠా’’

Update: 2016-02-03 03:39 GMT
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని స్నేక్ గ్యాంగ్ ఇష్యూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రేమ జంటలపై దాడులు చేయటం.. వారిపై అత్యాచారాలు చేయటం.. వాటిని వీడియోలుగా తీసి బెదిరించి సొమ్ము చేసుకునే దుర్మార్గం కొద్ది నెలల కిందట బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. స్నేక్ గ్యాంగ్ గా పేరొందిన ఈ ముఠా ఆగడాలు విని చాలామంది.. ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. కానీ.. వారి ఆగడాల గురించిన ఫిర్యాదులు ఒకటి తర్వాత ఒకటిగా బయటకు రావటం.. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించటంతో ఇలాంటి ఉదంతాలు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా వచ్చిన ఉదంతం విన్న వెంటనే స్నేక్ గ్యాంగ్ గుర్తుకు రాక మానదు. ఏపీ రాజధానికి దగ్గర్లో ‘‘తాడేపల్లి ముఠా’’ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

విజయవాడ పరిధిలో నున్న – పాయకరావు మధ్య 200 ఎకరాల్లో వెంచర్లు వేశారు. వాటిల్లో ఫ్లాట్లు చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఇక్కడకు ఏకాంతం కోసం ప్రేమ జంటలు.. వివాహేతర సంబంధం ఉన్న వారు వస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసిన ఈ తాడేపల్లి ముఠా వారిపై దాడికి పాల్పడతారు. ప్రేమ కబుర్లలో మునిగిపోయిన వీరిపై నలుగురు బ్యాచ్ గా ఉన్న తాడేపల్లి ముఠా దాడులు చేస్తారు. అనంతరం వారి దగ్గర డబ్బు దోచుకోవటం.. ఆపై అత్యాచారానికి పాల్పడటం లాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటారు.తాజాగా తాడేపల్లిలోని ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడి.. యువతిపై అత్యాచారం చేయటం.. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి గ్యాంగ్ వ్యవహారం బయటకొచ్చి సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 20 జంటలపై వీరు దాడులు చేసి.. అత్యాచారాలకు పాల్పడినట్లుగా గుర్తించారు.
Tags:    

Similar News