మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకో... కశ్మీర్ వీడియో వైరల్!
అవును... కశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి కశ్మీర్ లో సుమారు రెండు నెలలుగా వర్షాలు లేవు.. సరైన మంచు పడటం లేదు.;
‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో.. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో.. ఎందుకో ఏ విందుకో.. ఎవరితో’... అనే పాట వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో.. అంతకు మించి ఎన్నో రెట్లు మనస్సు ప్రశాంతంగా.. శారీరానికి వణికింతగా, పులకింతగా అనిపిస్తుంటుంది కశ్మీర్ లో ఉంటే అని అంటారు అనుభజ్ఞులు! కశ్మీర్ అందాలు, ఆ మంచు కురిసే దృశ్యాలు తలచుకున్నా పులకించిపోతారు మరికొందరు. ప్రస్తుతం కశ్మీర్ అలానే ఉంది!
అవును... కశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి కశ్మీర్ లో సుమారు రెండు నెలలుగా వర్షాలు లేవు.. సరైన మంచు పడటం లేదు. దీంతో అక్కడ పొడి చలి పరిస్థితులు తీవ్రమవుతూ ఉన్నాయి. ఫలితంగా.. వేగంగా క్షీణిస్తున్న నీటి వనరులపైనా ఆందోళనలు వ్యక్తమవుతోన్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపించింది. జమ్మూకశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ హిమపాతం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.
అలా భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగానే కశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో ఈ సీజన్ లో మొదటి హిమపాతం నమోదయ్యింది. ఇందులో భాగంగా.. గురెజ్ లోయ, పార్వాన్ లోయ, సింథాన్ టాప్, రాజ్ధాన్ పాస్, సాధనా టాప్, జోజిలా, సోన్ మార్గ్ లతో సహా పలు ఎత్తైన ప్రాంతాలలో మంచు కురిసినట్లు నివేదించబడింది. ఇదే సమయంలో కార్గిల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా హిమపాతం కురిసినట్లు చెబుతున్నారు. ఇది భారీ ఉపశమనం అని అంటున్నారు.
ఈ హిమపాతంతో కశ్మీర్ ప్రజలు భారీ ఉపశమనం పొందుతున్నారని అంటున్నారు. ఎందుకంటే.. కశ్మీర్ ను పట్టి పీడిస్తున్న తీవ్రమైన పొడి చలిని ఈ హిమపాతం తగ్గిస్తుంది.. ఇదే సమయంలో.. ఆందోళనకరంగా కుచించుకుపోవడం ప్రారంభించిన హిమానీనదాలు, వాగులు, నీటి కుంటలను తిరిగి నింపడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇది పర్యాటక రంగంలో కూడా ఆశావాదాన్ని పునరుద్ధరించిందని అంటున్నారు.
సన్నాహాలను సమీక్షించిన సీఎం ఒమర్ అబ్దుల్లా!:
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య కశ్మీర్ లోయ, జమ్మూ ప్రాంతాన్ని కవర్ చేసే శీతాకాల సంసిద్ధతపై సమీక్షా సమావేశానికి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షత వహించారు. భారీ హిమపాతాన్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. లోయలోని అన్ని జిల్లాల్లోనూ, ఎత్తైన ప్రాంతాల్లోని సంసిద్ధతను తాను సమీక్షించానని తెలిపారు. సన్నాహాలు ఖరారు చేయబడ్డాయని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... హిమపాతం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని అంగీకరిస్తూనే... సుదీర్ఘమైన పొడి వాతావరణం తర్వాత ఈ ప్రాంతం దీనికోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోందని సీఎం అన్నారు. ఇదే సమయంలో.. ఈ హిమపాతం గాలిని శుభ్రపరుస్తుందని.. కాలుష్యాన్ని తగ్గిస్తుందని.. వింటర్ టూరిజం సీజన్ ను ప్రారంభిస్తుందని అన్నారు.