కూటమిలో చిచ్చుకు.. సునీల్ ఐపీ'ఎస్'!
ఏపీకి చెందిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్.. కూటమిలో చిచ్చుకు ప్రయత్నిస్తున్నారా? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టి ఆయన రాజకీయ డ్రామాకు తెరదీశారా?;
ఏపీకి చెందిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్.. కూటమిలో చిచ్చుకు ప్రయత్నిస్తున్నారా? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టి ఆయన రాజకీయ డ్రామాకు తెరదీశారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ హయాంలో రఘురామ నరసాపురం ఎంపీగా ఉన్నారు. అప్పట్లో ఆయన జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సెటైరికల్‌గా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసులు పెట్టిన ప్రభుత్వం.. పుట్టిన రోజు నాడే హైదరాబాద్‌లో బలవంతంగాఅరెస్టు చేసి.. గుంటూరుకు తరలించి.. కస్టడీలో హింసించారన్న ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో ఏపీ సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే రఘురామ అరెస్టు, కస్టోడియల్ టార్చర్ జరిగాయని స్వయంగా రఘురామే వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా స్పందిస్తున్న సునీల్ కుమార్ రఘురామపై ఆరోపణలు పెంచుతున్నారు. వ్యక్తిగత విమర్శల వరకు కూడా వెళ్తున్నారు. తాజాగా రఘురామ రుణాలకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు విచారణ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చింది. దీనిని బూచిగా చూపిస్తున్న సునీల్ కుమార్.. తక్షణమే.. రఘురామను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారు.
అక్కడితో కూడా ఆగకుండా.. తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో సునీల్ కుమార్ మరింత దూకుడుగా విమర్శలు చేశారు. రఘురామ, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్ ఐఆర్ నమోదు చేసిందని.. ఆయనను ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అలెర్టుకావాలని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్‌లు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారని.. పెట్టుబడులు తెస్తున్నారని సునీల్ చెప్పడం గమనార్హం.(ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న విషయం ప్రస్తావనార్హం) ఈ నేపథ్యంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందన్నారు.
ఇప్పుడు కనుక డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామను సీబీఐ అరెస్టు చేస్తే.. ఆ ఇమేజ్ పోతుందని సునీల్ తెగ బాధ పడ్డారు. అందుకే తాను సెల్ఫీ వీడియో చేస్తున్నానని.. బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు రఘురామను ఆ పదవి నుంచి తప్పించా లన్నారు. మొత్తంగా సునీల్.. ఈ వ్యవహారం ద్వారా.. అటు సీఎం, డిప్యూటీసీఎం, మంత్రిని కొనియాడుతూ.. మరోవైపు.. తనకు వ్యక్తిగత కోపం లేదంటూనే రఘురామను తప్పించాలని కోరడం విశేషం. తద్వారా.. కూటమికి మేలు చేస్తున్నానన్న వాదనతో చిచ్చు పెట్టే ప్రయత్నంతోపాటు.. బద్నాం చేసే ప్రయత్నంలో ఉన్నారన్నది టీడీపీ నాయకులు చేస్తున్న వాదన. ఏదేమైనా.. ఈ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.