గాంధీ హత్యపై స్వామి సంచలన ఆరోపణలు

Update: 2016-07-28 10:26 GMT
కొద్దివారాలుగా నోరు మెదపకుండా ఉన్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తాజాగా మరో బాంబు పేల్చారు. అయితే... అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈసారి మహాత్మ గాంధీ హత్యపై సరికొత్త ఆరోపణలు చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఇటలీ వ్యక్తుల పాత్ర ఉందని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. 'మహాత్మా గాంధీని ఇటలీ వ్యక్తి స్ఫూర్తితో ఇటలీ నుంచి దిగుతి చేసిన తుపాకీతో గాడ్సే కాల్చి చంపాడు. ఆ ఇటలీ వ్యక్తి ఎవరు?' అంటూ ట్వీట్ చేసి కొత్త సందేహాలకు తెరతీశారు.

కాగా ఈ విషయంలో సుబ్రమణ్య స్వామి కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తానని చెప్పారు. అందుకు ఆగస్టు 15 తరువాత ముహూర్తం పెట్టారు. గాంధీ హత్యపై ఆగస్టు 15 తరువాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. గత వారంలో గాంధీ హత్యపై పార్లమెంటులో చర్చను చేపట్టాలని స్వామి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే స్వామి సోనియా గాంధీ కుటుంబంపై పెద్ద రీసెర్చే చేస్తుంటారు. సోనియా గాంధీ కుటుంబాన్ని కోర్టుకీడ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు కూడా స్వామి ఎఫెక్టే. అయితే.. ఆ తరువాత ఆయన ఇటీవల ఆర్బీఐ గవర్నరు - ప్రధాని ఆర్థిక సలహాదారులతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కూడా టార్గెట్ చేసి వరుస వ్యాఖ్యలు - ఆరోపణలు చేయడంతో బీజేపీ నుంచే ఆయనకు ప్రతిఘటన ఎదురైంది. దాంతో మోడీ ఆయన్ను కంట్రోల్ చేశారని చెబుతారు.  ఆ దెబ్బకు కొద్దికాలంగా కామ్ గా ఉన్న ఆయన ఈసారి మహాత్మా గాంధీ హత్య వెనుక కొత్త కోణాలను బయటపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఇటలీ పాత్ర గురించి ఆయన సంకేతాలిస్తుండడంతో మళ్లీ సోనియాపై ఆయన బాణాలు వేస్తారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఏం సంచలన వివరాలు వెల్లడిస్తారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Tags:    

Similar News