రాహుల్ కు స్వామి సంచలన సలహా

Update: 2016-08-26 09:33 GMT
సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి. తన ప్రత్యర్థులకు ఎక్కడో కాలిపోయేలా వ్యాఖ్యలు చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు తూటాల్లా ఉంటాయి. అలాంటి స్వామికి.. గాంధీ ఫ్యామిలీ మీద విమర్శలు చేయటం అంటే చాలు మరింత చెలరేగిపోతారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్.. రాహుల్ మధ్య ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే.

జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు ఆర్ ఎస్ ఎస్ కారణమంటూ రాహుల్ వ్యాఖ్యలు చేయటం.. దీనిపై ఆ సంస్థ కోర్టుకు వళ్లటం తెలిసిందే. ఈ కేసు విచారణలో రాహుల్ స్పందిస్తూ.. తాను ఆర్ ఎస్ ఎస్ ను ఏమీ అనలేదని.. ఆ సంస్థకు చెందిన కొందరి మీదనే తాను విమర్శలు చేసిందంటూ వ్యాఖ్యానించారు. దీన్ని సంఘ్ వర్గాలు యూటర్న్ గా అభివర్ణిస్తే.. కాంగ్రెస్ నేతలు అందుకు భిన్నంగా స్పందించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. ఆర్ ఎస్ ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుంది’’ అంటూ ట్వీట్ చేయటంపై సంఘ్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై స్వామి గళం విప్పారు. సంఘ్ మీద రాహుల్ చేసినట్లుగా చెబుతున్న తాజా ట్వీట్ నిజానికి ఆయన అలా చేసి ఉండరని.. ఆయన ఆఫీసులో మరెవరో చేసి ఉంటారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం తాను రాహుల్ గాంధీకి ఒక సలహా ఇవ్వాలని భావిస్తున్నానని.. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని.. ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని ఘాటుగా మండిపడ్డారు. జాతీయప్రాధాన్యత ఉన్న అంశాల మీద రాహుల్ తరచూ యూటర్న్ తీసుకోవటం ఎక్కువైందని.. ఆయన నిష్క్రమణతో అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచినట్లు అవుతారంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. 
Tags:    

Similar News