కళ్లు తెరిచిన సోనియా.. వడి వడిగా నిర్ణయాలు.. సచిన్ పైలెట్ కు హామీ

Update: 2021-06-14 03:30 GMT
చేతిలో అధికారం ఉంచుకొని కూడా వడివడిగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే అలసత్వం అంతా ఇంతా కాదు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలం కావటం ద్వారా.. సమస్యను మరింత పెంచి పోషించటమే తప్పించి మరొకటి ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయాన్ని సాగదీస్తున్న వైనం గురించి తెలిసిందే. దీని వల్ల పార్టీకి మరింత నష్టమే తప్పించి ఎలాంటి లాభం ఉండదు.

అదే విధంగా పవర్ లో ఉన్న రాజస్థాన్ లో తనను పక్కన పెట్టారన్న గుర్రుతో ఉన్న సచిన్ పైలెట్ ను బుజ్జగించేందుకు.. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా తొమ్మిది స్థానాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో నిర్ణయం తీసుకోవటానికి ఇంతకాలం జాగు చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా కళ్లు తెరిచినట్లుగా చెబుతున్నారు. యూపీలో పార్టీ యువనేత జితిన్ ప్రసాద్ బీజేపీలోకి వెళ్లిన నేపథ్యంలో పార్టీ ఒక్కసారిగా అలెర్టు అయ్యింది.

ఇతర రాష్ట్రాల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లో సచిన్ పైలెట్ డిమాండ్లకు తలొగ్గి..రాజీ ధోరణలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాజస్థాన్ లో అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ చేస్తున్నట్లుగా సంకేతాలు ఇవ్వటమే కాదు.. సచిన్ పైలెట్ వర్గానికి ఐదు మంత్రి పదవులు ఇవ్వనున్న విషయాన్ని తెలియజేసినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రాజస్థాన్ లో పార్టీకి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News